'కింగ్స్టన్'.. భారతీయ సినిమాల్లోనే ఓ విభిన్న ప్రయోగం!
ఈ సినిమా అనుభవాన్ని ‘బాహుబలి’ లేదా ‘కాంతారా’ తరహాలో గొప్ప విజువల్ స్పెక్టాకిల్‌గా భావించవచ్చని ఆయన చెబుతున్నారు.;
కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ ‘కింగ్స్టన్’తో ఈసారి డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులు చూసిన సినిమాల కంటే భిన్నంగా, ఈసారి ఓ సముద్ర నేపథ్యంపై ఆధారపడి రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. ఈ సినిమా అనుభవాన్ని ‘బాహుబలి’ లేదా ‘కాంతారా’ తరహాలో గొప్ప విజువల్ స్పెక్టాకిల్‌గా భావించవచ్చని ఆయన చెబుతున్నారు.
ఈ సినిమా కథను గమనిస్తే, ఒక తీర గ్రామాన్ని సముద్రంకు సంబంధించిన ఏదో ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది. ఆ ఊరికి సంబంధించి బయటపడే రహస్యాలు కథలో కీలకంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే, సినిమాలో భూతాలు, జాంబీలాంటి ఆత్మలు హైలెట్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అవి ఎలా కథను నడిపిస్తాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో జివి ప్రకాశ్ మాట్లాడుతూ, ఇది భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి సముద్ర కథాంశంతో రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పారు. ఫాంటసీ, హారర్ కలబోసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరికొత్తగా ఆస్వాదించేలా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ కథలో ఒక మత్స్యకారుడు తన గ్రామాన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు, శాపాన్ని ధైర్యంగా ఎదుర్కొనే తీరు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇక ‘కింగ్‌స్టన్’ చిత్రీకరణ ఎంతో సవాళ్లను ఎదుర్కొందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర గర్భంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రత్యేకమైన టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఓ షిప్ మీద జరిగిన యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం భారీ సెట్లు వేయించడంతో పాటు, జివి ప్రకాశ్ కూడా మూడు నిమిషాలపాటు నీటిలో శ్వాసను కంట్రోల్ చేస్తూ ఉండేందుకు ప్రత్యేకమైన శిక్షణ పొందాడు. సినిమా ఎఫెక్ట్ కోసం అంతర్జాతీయ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వాడినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మరో హైలైట్ అని అంటున్నారు. చీకటి సముద్రం నేపథ్యాన్ని అత్యంత సహజంగా చూపించేందుకు సినిమా మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, ప్రతి షాట్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. విజువల్ ప్రెజెంటేషన్ మాత్రమే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ సినిమా మార్చి 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగులో గంగా ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో ‘కింగ్‌స్టన్’ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని జివి ప్రకాశ్ భావిస్తున్నాడు. మరి, సముద్రం నేపథ్యాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.