శోభిత ఓకే చెప్పాకే డెసిషన్ తీసుకుంటా: నాగచైతన్య
రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ శోభిత గురించి మాట్లాడుతూ ఆమెను తెగ పొగిడేశాడు.
నాగ చైతన్య, శోభితా ధూళిపాల గతేడాది ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, డిసెంబర్ లో ఇరు కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైతూ, శోభితలు గత కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు.
నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా చైతూ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రధాన నగరాలన్నీ తిరిగి అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ శోభిత గురించి మాట్లాడుతూ ఆమెను తెగ పొగిడేశాడు.
శోభితతో తను ప్రతీ విషయాన్నీ షేర్ చేసుకుంటానని, కీలక విషయాల్లో ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడతాయని, తనకు గందరగోళంగా అనిపించినప్పుడు ఆమె ఇచ్చే సపోర్ట్ తనని నార్మల్ గా మార్చేస్తుందని, తన డెసిషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయని, ఆమె నిర్ణయాన్ని తానెప్పుడూ గౌరవిస్తానని, తాను ఏం చేయాలన్నా ఆమె ఓకే చెప్పాకే చేస్తానని చైతూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
వైజాగ్ లో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో కూడా చైతూ, శోభిత ప్రస్తావన తీసుకొచ్చాడు. వైజాగ్ తనకెంతో స్పెషల్ అని, ఎంత స్పెషల్ అంటే తాను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకునేంత ఇష్టమని, తన ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ వాళ్లదేనని, తండేల్ కు వైజాగ్ ఆడియన్స్ సపోర్ట్ కావాలని చైతూ కోరాడు.
సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన తండేల్ సినిమా యదార్థ కథల ఆధారంగా రూపొందింది. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఇప్పటికే తండేల్ నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తండేల్ సక్సెస్ పై చైతూ చాలా నమ్మకంగా ఉన్నాడు.