పాత వీడియోతో దిల్ రాజు టార్గెట్

Update: 2022-11-10 11:30 GMT
సంక్రాంతి పండ‌క్కి ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ఉంది. ఐతే ఏడాదిలో అతి పెద్ద సింగిల్ వీక్‌ సీజ‌న్ అయిన సంక్రాంతికి ఎప్ప‌ట్లాగే చాలా ముందే బెర్తులు బుక్ అయిపోయాయి. చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి చిత్రాల‌తో పాటు త‌మిళ డ‌బ్బింగ్ మూవీ వార‌సుడు సంక్రాంతి రేసులో నిలిచాయి.

ఐతే డ‌బ్బింగ్ సినిమా అయిన‌ప్ప‌టికీ దిల్ రాజు నిర్మించ‌డం వ‌ల్ల వార‌సుడుకు తెలుగులో మంచి రిలీజే ద‌క్కేలా ఉంది. కానీ ఒక అనువాద చిత్రానికి చిరు, బాల‌య్య‌ల సినిమాల‌కు దీటుగా నైజాం ఏరియాలో స్క్రీన్లు కేటాయిస్తున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.

వార‌సుడు సినిమా కోసం చాలా ముందుగానే రాజు స్క్రీన్లు బుక్ చేస్తున్నాడంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామం టాలీవుడ్లో పెద్ద చ‌ర్చ‌కే దారి తీస్తోంది. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు పాత వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నాలుగేళ్ల కిందట సంక్రాంతికి య‌న్.టి.ఆర్-క‌థానాయ‌కుడు, విన‌య‌విధేయ రామ‌, ఎఫ్‌-2ల‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం 'పేట' కూడా రిలీజైంఇ. ఐతే ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఓ నిర్మాత.. దానికి థియేటర్లు కేటాయించకపోవడంపై దిల్ రాజును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించాడు.

దీనికి బ‌దులుగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ‌వుతుండ‌గా.. వేరే భాష‌కు చెందిన సినిమాకు థియేట‌ర్లు ఎలా ఇస్తామ‌ని ప్ర‌క‌టించాడు.

ఆ వీడియోనే ఇప్పుడు ఆయ‌న వ్య‌తిరేకులు సోష‌ల్ మీడియాలో తెగ‌ తిప్పుతున్నారు. వార‌సుడు ప‌క్కా త‌మిళ మూవీ అని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో.. వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి లాంటి పెద్ద తెలుగు సినిమాల‌కు దీటుగా ఓ త‌మిళ అనువాద చిత్రానికి రాజు ఎలా ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చుకుంటాడంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు దిల్ రాజు ఏం స‌మాధాన‌మిస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News