నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మహేష్ బాబు: ప్రశాంత్ నీల్

Update: 2022-04-18 16:40 GMT
'కేజీయఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ - సెంటిమెంట్ ని నీల్ హ్యాండిల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు 'కేజీయఫ్: చాప్టర్ 2' తో శాండీల్ వుడ్ డైరెక్టర్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

'కేజీఎఫ్‌' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కేజీయఫ్: చాప్టర్ 2' ఇటీవలే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో కన్నడ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడని ప్రశాంత్ నీల్ ను కన్నడిగులు కొనియాడుతున్నారు. ఈ సినిమా పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'సినిమా చూసిన తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు కాల్ చేశారని విన్నాం' అని యాంకర్ అంటుండగా.. 'జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు మాట్లాడారు' అని నీల్ తెలిపారు.

ఫస్ట్ కాల్ చేసింది ఎవరని అడగ్గా.. మహేష్ బాబు అని సమాధానమిచ్చారు. తాను వెళ్లి సూపర్ స్టార్ ని కలిసినట్లు కేజీఎఫ్ డైరెక్టర్ చెప్పారు. ఎవరినైనా ఫోన్ చేస్తే సినిమా చేయడానికి ఆహ్వానించడమని కాదు.. గుడ్ జాబ్ అని మనం చేసిన పనిని అభినందించే సంస్కృతి మాత్రమే అని పేర్కొన్నారు. తాను కూడా అదే ఫీల్ అవుతానని.. ఎక్కువ మందిని కలిసి వారితో రిలేషన్ డెవలప్ చేసుకోవడాన్ని ఇష్టపడతానన్నారు.

ఈ సందర్భంగా 'కేజీఎఫ్' తర్వాత తెలుగు సినిమా అనౌన్స్ చేయడంపై కన్నడిగులు ట్రోల్స్ ఎదుర్కోవడంపై ప్రశాంత్ నీల్ స్పందించారు. నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన కన్నడ ఇండస్ట్రీని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. 'ఇప్పుడు నేను తెలుగులో సినిమా చేస్తున్నానంటే అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని కాదు.. నాకు రిలేషన్ షిప్స్ పెంచుకోవడం అంటే ఇష్టం. వాళ్ళు నన్ను కలిసిన విధానం నాకు నచ్చుతుంది' అని నీల్ తెలిపారు.

''రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ పెట్టాను. దానికి ఫుల్ నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అవి నాలుగు గంటల సేపు నన్ను బాగా డిస్టర్బ్ చేసాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా మాట్లాడని వాళ్ళు సడెన్ గా ఇలా అంటున్నారేంటి అని బాధ పడ్డాను. ఆ నాలుగు గంటల తర్వాత ఈ క్షణం వరకూ మళ్లీ నేను దాని గురించి ఆలోచించలేదు. నా లైఫ్ గురించి వాళ్లకు తెలియదు కాబట్టి అలా అనుకొని ఉంటారు. అందుకు వాళ్ళను బ్లేమ్ చేయలేం'' అని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే మూవీ చేస్తున్నారు. దీని తర్వాత తారక్ హీరోగా #NTR31 మూవీ స్టార్ట్ చేస్తారు. నిజానికి మహేష్ బాబుతో కూడా కేజీఎఫ్ దర్శకుడు ఓ సినిమా చేయాల్సి ఉంది. టాలీవుడ్ నుంచి నీల్‌ ని సంప్రదించిన హీరోల్లో మహేష్ మొదటివాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

మహేష్ కోసం కన్నడ దర్శకుడు ఓ కథ కూడా సిద్ధం చేశాడని.. అయితే అందులో కొన్ని సందేహాలు వెలిబుచ్చుతూ అగ్ర హీరో ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడని టాక్ వచ్చింది. అదే కథను ప్రశాంత్ ఇప్పుడు ప్రభాస్ తో సలార్ గా చేస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News