పుష్ప 2 ఘటన.. తండ్రిని గుర్తు పట్టని శ్రీతేజ్
ప్రిమియర్ షో తొక్కిసలాట ఘటనలో వివాహిత రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స సొందుతున్నాడు
'పుష్ప 2' సినిమా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో ఘటన తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రిమియర్ షో తొక్కిసలాట ఘటనలో వివాహిత రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స సొందుతున్నాడు. గత మూడు వారాలుగా శ్రీతేజ్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అత్యున్నత చికిత్స ప్రస్తుతం ఆ బాబుకు అందుతుందని, అయినా అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందని వైద్యులు చెబుతున్నారు. వారం రోజుల క్రితంతో పోల్చితే శ్రీతేజ్ కాస్త తేరుకున్నాడు అంటూ వైద్యులు చెబుతున్నారు. కానీ శ్రీతేజ్ తండ్రి మాత్రం మరో విధంగా బాబు ఆరోగ్యం గురించి చెప్పడం మరింతగా చర్చనీయాంశం అవుతోంది.
శ్రీతేజ్ తనను గుర్తు పట్టడం లేదని, అతడి ఆరోగ్యం విషయంలో ఇంకా ఆందోళనగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కన్న కొడుకు గుర్తు పట్టడం లేదు అంటూ భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేసిందని, అలాగే అల్లు అర్జున్ తరపు నుంచి సహాయం అందింది అంటూ అతడు చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడంకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని భాస్కర్ అన్నాడు. తనయుడు ఆరోగ్యంపై ఆందోళనతో భాస్కర్ కనిపిస్తున్నారు. వైద్యులు మాత్రం ప్రాణాపాయం లేదు అంటూ ఒక హామీ అయితే ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.
పుష్ప 2 సినిమాకి వచ్చిన భారీ హైప్‌కి తోడు అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారులో ర్యాలీగా థియేటర్‌కు రావడం, థియేటర్ వద్ద భద్రత ఏర్పాట్లు జరిగా లేకపోవడంతో జనాలు పెద్ద ఎత్తున లోనికి వచ్చారు. దాంతో శ్రీతేజ్‌తో పాటు అతడి తల్లి రేవతి తొక్కిసలాటలో జనాల కాళ్ల కింద పడ్డారు. దాంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. అల్లు అర్జున్‌ను చూడాలి అనే తపనతోనే చాలా మంది థియేటర్ లోపల దూసుకు రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ పోలీసులు చెబుతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం విషయంలో పూర్తి బాధ్యత తనదే అన్నట్లుగా అల్లు అర్జున్ ఇప్పటికే పలు సార్లు చెప్పుకొచ్చారు.
అన్నట్లుగానే అల్లు అర్జున్ నుంచి ఆర్థిక సాయం అందింది. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సైతం రూ.50 లక్షలకు పైగా ఆర్థిక సాయంకు ముందుకు వచ్చారు. ఆర్థిక సాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అతడి ఆరోగ్యం విషయంలోనే ఆందోళన అంటూ భాస్కర్ ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. విదేశాల నుంచి వైద్యులను రప్పించి అయినా శ్రీతేజ్ కు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ సైతం అత్యున్నత చికిత్సను అందించేందుకు ఆర్థిక సాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.