ప్చ్!! రేపటి నుండి వసూళ్ళు కష్టమే

Update: 2017-10-02 14:13 GMT
మొత్తానికి దసరా సీజన్ గ్రాండ్ గా మొదలై.. గ్రాండ్ గానే ముగుస్తోంది. గాంధి జయంతి సెలవ కలసిరావడంతో అక్టోబర్ 2ను కూడా కలుపుకుని.. ఈ సీజన్ దిగ్విజయంగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే ఉంటారు. అయితే ఇలాంటి హాలిడే సీజన్ పూర్తయపోతోంది అంటే.. ఆ సీజన్లో వచ్చిన సినిమాలకు మాత్రం కాస్త గడ్డు కాలం దాపరించబోతోంది అనే చెప్పాలి. సెలవలు పూర్తయ్యాక అందరూ బిజీ అయిపోవడం.. ఆడియన్స్ కరువవ్వడం అందుకు కారణం.

ఈసారి దసరాకు.. జూనియర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'.. మహేష్‌ బాబు 'స్పైడర్'.. అదే విధంగా శర్వానంద్ 'మహానుభావుడు' సినిమాలు విడదలయ్యాయి. ఈ సినిమాల్లో ఒక్కో సినిమా కలక్షన్లు ఒక్కో తరహాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండవ వారంలో అడుగుపెట్టేసిన జై లవ కుశ సినిమా ఆల్రెడీ 65 కోట్ల షుమారు షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. అయితే మొత్తంగా 86 కోట్లు షేర్ వస్తేనే పంపిణీదారులు అందరూ గట్టెక్కుతారు. ఇకపోతే స్పైడర్ సినిమాకు తొలి వీకెండ్ లో తమిళనాడును కూడా కలుపుకుని ఏకంగా 42 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక సినిమా లాభాల బాటలో పడాలంటే దాదాపు 124+ కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంది. మహానుభావుడు విషయం చూసుకుంటే.. 10+ కోట్లు ప్రపంచవ్యాప్త షేర్ తొలి వీకెండ్లో రాగా.. మొత్తంగా 20 కోట్ల షేర్ వసూలు చేస్తే పంపిణీదారులు అందరూ లాభాలబాట పట్టే ఛాన్సుంటుంది.

ఇప్పుడు విషయం ఏంటంటే.. ఈ సినిమాలకు ఇంతేసి పెద్ద టార్గెట్లు ఉన్న దృష్ట్యా.. ఇప్పుడు సెలవలన్నీ అయిపోయాయ్ కాబట్టి.. రేపటి (మంగళవారం) నుండి వసూళ్ళు రాబట్టడం అంత ఈజీ కాదు. దగ్గర్లో మరే పెద్ద సినిమాలూ లేవు కాబట్టి.. మరో రెండు వారాలు హ్యాపీగా దున్నేసుకునే ఛాన్సు ఉన్నప్పటికీ.. ఉద్యోగులు.. పిల్లలూ.. స్టూడెంట్లూ.. ఆఫీసీలూ స్కూళ్ళూ కాలేజీలు అంటూ బిజీ అయిపోవడం వలన.. అసలు ధియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్యే దక్కుతుంది. మరి ఈ దసరా సినిమాలన్నీ ఏ విధంగా ఈ అడ్డుగోడలను అవరోహించి సేఫ్‌ జోన్ లోకి వచ్చేస్తాయో చూద్దాం.
Tags:    

Similar News