మోహన్ లాల్ 'బరోజ్ 3డీ' - త్రీడీ ఫార్మాట్‌లో నెవ్వర్ బిఫోర్ అనేలా..
"నేను ఎన్నో కథలు, పాత్రలతో మీ ముందుకు వచ్చాను. కానీ, 'బరోజ్ 3డీ' నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఇది నా మొదటి త్రీడీ డైరెక్ట్ చేసిన సినిమా.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'బరోజ్ 3డీ' భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్‌గా రూపొందిన ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్, ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రెస్ మీట్‌లో మోహన్ లాల్ మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
"నేను ఎన్నో కథలు, పాత్రలతో మీ ముందుకు వచ్చాను. కానీ, 'బరోజ్ 3డీ' నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఇది నా మొదటి త్రీడీ డైరెక్ట్ చేసిన సినిమా. త్రీడీ ఫార్మాట్‌లో గత 40 ఏళ్లుగా ఎవరూ ప్రయత్నించని కొత్త దారిని ఈ సినిమాతో ప్రారంభించాను. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. బరువు తక్కువగా ఉన్న కథతో, మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసే చిత్రంగా రూపొందించాం” అని అన్నారు.
ఈ సినిమాకు బాల మేధావి లిడియన్ నాదస్వరం సంగీతాన్ని అందించారని, ఆయన స్వరపరచిన పాటలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయని, సినిమాకు ప్రత్యేక బలాన్ని చేకూర్చాయని తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ సంతోష్ శివన్ పనిచేశారని, అంతేకాదు, తన స్నేహితుడు రాజీవ్ కుమార్ మొదటి త్రీడీ చిత్రంలో భాగమయ్యారని మోహన్ లాల్ చెప్పారు. ఈ సినిమా గ్రాండ్ విజువల్స్ అందించేందుకు అత్యుత్తమ టెక్నికల్ టీమ్ పని చేసిందని తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్‌తో జనతా గ్యారేజ్ సమయంలో మొదలైన సంబంధం ఇప్పుడు మరో ముందడుగుగా మారిందని, వారి గ్రేట్ విజన్‌తో 'బరోజ్ 3డీ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందని మోహన్ లాల్ అన్నారు. ఇక క్రియేటివ్ హెడ్ టీకే రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, “మోహన్ లాల్ గారు డైరెక్టర్‌గా చేసిన ఈ చిత్రంలో భాగమవడం గొప్ప ఆనందంగా ఉంది. మోహన్ లాల్ అనుభవం చిత్రానికి కొత్తగా కనిపించే కథా తీరును అందించింది.
ఈ సినిమా త్రీడీ, యానిమేషన్, విఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో అత్యున్నత ప్రామాణికతను కలిగి ఉంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు” అని చెప్పారు. ముఖేష్ మెహతా, మోహన్ లాల్‌తో గతంలో కూడా పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, “ఈ సినిమా నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి రూపొందించారు. త్రీడీ టెక్నాలజీని సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే చిత్రంగా మారుతుంది” అని అభిప్రాయపడ్డారు.
తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ రవిశంకర్ మాట్లాడుతూ, “మోహన్ లాల్ గారు ఈ సినిమాను ఎంతో ప్రేమతో తీశారు. మేము చిన్నప్పుడు చూసిన 'చిన్నారి చేతన' లాంటి సినిమాలను గుర్తు చేసేలా 'బరోజ్ 3డీ' ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే చిత్రంగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం” అని అన్నారు. ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచుతున్న ఈ సినిమా, ఫెస్టివల్ సీజన్‌లో అందరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.