'ఈ రాతలే'.. 'రాధే శ్యామ్' నేపథ్యాన్ని తెలియజేసే ప్రేమగీతం..!

Update: 2021-11-15 16:34 GMT
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - పూజ హెగ్డే జంటగా న‌టిస్తోన్న తాజా చిత్రం ''రాధే శ్యామ్''. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ పీరియాడికల్ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా మ్యూజికల్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ చిత్ర బృందం ‘ఈ రాతలే’ అనే ఫస్ట్ సింగిల్ ని తాజాగా విడుదల చేసింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల 'ఈ రాతలే' పాటను మేకర్స్ అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. అయితే ఇప్పుడు లిరికల్ వీడియో వచ్చాక.. వారి ఎదురు చూపులకు తగిన స్టఫ్ లభించిందనే చెప్పాలి. ''ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా..'' అంటూ సాగిన ఈ గీతం శ్రీతలను విశేషంగా అలరిస్తోంది. ప్రభాస్ - పూజా హెగ్డేల మోషన్ పోస్టర్స్ తో రూపొందిన ఈ సాంగ్ సినిమా నేపథ్యాన్ని ఆవిష్కరిస్తోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ పాట విడుదలైంది.

రైలులో ప్రయాణిస్తున్న తన ప్రేయసి చెయ్యిని అందుకోవాల‌ని కారులో ప్రయనిస్తున్న ప్రేమికుడు ప్రయత్నించగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ క్రమంలో అతను ఆమెను తన కారులో ఎక్కించుకొని లోకాలన్నీ విహరిస్తున్నాడు. ఈ ప్రేమ జంట విధిని ఎదిరించి చివరకు ఒకటైనట్లు 'ఈ రాతలే' లిరికల్ వీడియో సూచిస్తోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ పాటకు ఫ్రెష్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. యువన్‌ శంకర్‌ రాజా - హరిణి ఇవటూరి కలిసి వినసొంపుగా ఆలపించారు. తెలుగు వెర్సన్ కు లిరిసిస్ట్ కృష్ణకాంత్‌ సినిమా నేపథ్యాన్ని వివరించేలా సాహిత్యం అందించారు.

అనిల్ కుమార్ ఉపాధ్యాయుల - వెంకీ కలిసి 'ఈ రాతలే' కాన్సెప్ట్ డిజైన్ చేశారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. 'రాధే శ్యామ్' సినిమాని యూవీ క్రియేషన్స్‌ - గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 70ల కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Full View
Tags:    

Similar News