ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్లలో ఎక్స్‌ట్రా కుర్చీలు

సినిమా చూడ్డం కోసం పల్లెటూళ్ల నుంచి ఎద్దుల బండ్లు కట్టుకుని.. ట్రాక్టర్లు వేసుకుని థియేటర్లకు రావడం.. టికెట్ల కోసం క్యూల్లో జనాలు కొట్టేసుకోవడం, లాఠీఛార్జీలు జరగడం

Update: 2025-01-16 15:29 GMT

సినిమా చూడ్డం కోసం పల్లెటూళ్ల నుంచి ఎద్దుల బండ్లు కట్టుకుని.. ట్రాక్టర్లు వేసుకుని థియేటర్లకు రావడం.. టికెట్ల కోసం క్యూల్లో జనాలు కొట్టేసుకోవడం, లాఠీఛార్జీలు జరగడం.. థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లు వేలం పాట పాడినట్లు ధరలు చెప్పడం.. థియేటర్ల లోపల సీట్లు సరిపోక డబ్బులు తీసుకుని అదనపు కుర్చీలు వేయించి సినిమా చూపించడం.. ఇలా ఒకప్పుడు సినిమా వైభవం మామూలుగా ఉండేది కాదు. కానీ మారిన పరిస్థితుల్లో ఆ దృశ్యాలన్నీ కనుమరుగైపోయాయి. థియేటర్లకు వచ్చే జనం సంఖ్య తగ్గిపోయింది. ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాల వల్ల థియేట్ల దగ్గర టికెట్ల కోసం కొట్టేసుకోవడాలు లేవు. ఇంకా చాలా దృశ్యాలు కనుమరుగైపోయాయి. ఐతే ఇలాంటి రోజుల్లో మళ్లీ వింటేజ్ దృశ్యాలను చూపిస్తోంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. సంక్రాంతి సీజన్లో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో టికెట్ ముక్క దొరక్క చాలా ఇబ్బంది అయిపోతోంది ప్రేక్షకులకు. పోటీలో ఇంకో రెండు సినిమాలు ఉండడం వల్ల తొలి రెండు రోజుల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి స్క్రీన్లు సరిపోలేదు. టికెట్లు దొరక్క ప్రేక్షకులు అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో టౌన్లలోని థియేటర్లలో టికెట్ డబ్బులు తీసుకుని ఎక్స్‌ట్రా కుర్చీలు వేయిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్చీలను దింపి థియేటర్లలకి తీసుకెళ్తున్న, అలాగే ప్రేక్షకులు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని సినిమా చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇది చూసి నిన్నటితరం ప్రేక్షకులు నోస్టాల్జిగ్గా ఫీలవుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్ల అమ్మకాలు కూడా జరుగుతున్నాయట. ఈ వీకెండ్ అయ్యే వరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిమాండ్ తగ్గేలా లేదు. కాబట్టి థియేటర్లలో కుర్చీలు వేసి సినిమా చూపించడం, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఆదివారం వరకు కొనసాగేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News