మతాన్ని కించపరిచాడు.. కమెడియన్‌పై 4 సెక్షన్ల కింద ఫిర్యాదు
ఫరూఖి తన షోతో యువతరం మనస్సులను, సమాజాన్ని కలుషితం చేసాడు. మతాలను అవమానించాడు.. సాంసృతిక విలువలను ఉల్లంఘించాడు!
బిగ్ బాస్ 17 విజేత, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ తీవ్రమైన చిక్కుల్లో పడ్డాడు. అతడు ప్రస్తుతం కొత్త షో 'హఫ్తా వసూలి'లో హోస్ట్ గా కనిపిస్తున్నారు. జియో హాట్‌స్టార్‌లో ప్రదర్శితమైన ఈ షో ప్రస్తుత రాజకీయ, సాంస్కృతిక వ్యవహారాలపై ప్రత్యేక కార్యక్రమం. ఇది ఒక వ్యంగ్య న్యూస్‌రూమ్ కామెడీ. అయితే ఈ షో మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, అసభ్యతను ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలవ్వడంతో ఇబ్బందుల్లో పడింది. ఈ షోని నిషేధించాలని, ఫరూఖీని అరెస్ట్ చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఫరూఖి తన షోతో యువతరం మనస్సులను, సమాజాన్ని కలుషితం చేసాడు. మతాలను అవమానించాడు.. సాంసృతిక విలువలను ఉల్లంఘించాడు! అంటూ ఐటీ చట్టం సహా ఇతర సంబంధిత BNS సెక్షన్లు 196, 299, మరియు 353 కింద FIR నమోదు చేయాలని న్యాయవాది అమితా సచ్‌దేవా ఫిర్యాదు దాఖలు చేశారు.
తొలిగా హిందూ జనజాగృతి సమితి 'హఫ్తా వసూలి'ని నిషేధించాలని డిమాండ్ చేసింది. ఎక్స్-లో ఒక ట్వీట్‌లో హిందూ సమితి ప్రతినిధులు వ్యాఖ్యానిస్తూ... ''జియో హాట్‌స్టార్‌లో #హఫ్తా వసూలి ప్రసారంపై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాము! ఈ షోలో మునావర్ అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజావీక్షణకు ఆమోదయోగ్యం కాదు. నైతిక విలువలను తగ్గించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'' అని హెచ్చరించారు. హఫ్తా వసూలి మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 14న ప్రసారం అయింది. ఇందులో షరీబ్ హష్మి, వివియన్ ద్సేనా అతిథులుగా కనిపించారు. రెండవ ఎపిసోడ్‌లో సాకిబ్ సలీమ్ నటించారు.
ఓవైపు సమయ్ రైనా 'ఇండియాస్ గాట్ లాటెంట్' వివాదం నలుగుతుండగానే, ఇంతలోనే ఫరూఖి షోపైనా కొత్త వివాదం మొదలైంది. అతిథిగా కనిపించిన రణవీర్ అల్లాబాడియా అకా బీర్ బైసెప్స్ ఒక సెక్షన్‌లో ఒక పోటీదారుడిని అదుపు తప్పి ప్రశ్నించారు. ''నీ తల్లిదండ్రులు జీవితాంతం సెక్స్ చేయడం చూడాలనుకుంటున్నావా? లేదా నువ్వు ఒక్కసారి చేరి శాశ్వతంగా ఆపేస్తావా?'' అని ప్రశ్నించాక వివాదం చెలరేగింది. సమయ్ రైనా వ్యాఖ్య ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దారుణమైన వ్యాఖ్యకు అతడిపై వరుసగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ విషయం భారత సుప్రీంకోర్టు, పార్లమెంటు వరకూ చేరింది. చివరికి సమయ్ యూట్యూబ్ నుండి అన్ని షో ఎపిసోడ్‌లను తొలగించారు.
ఈ వివాదం ఇలా ఉండగానే, 2021లో షో పేరుతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మునావర్ సహా మరో నలుగురు స్టాండ్-అప్ కమెడియన్‌లను జనవరి 2న పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. 35 రోజులు జైలులో గడిపిన తర్వాత మునావర్‌కి బెయిల్ లభించింది.