ఫేక్ వ్యాక్సినేష‌న్ సూత్ర‌ధారులు వీళ్లేనా?

Update: 2021-06-19 12:30 GMT
ముంబై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెలుగు చూసిన ఫేక్ వ్యాక్సినేష‌న్ అంశం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని ఓ హౌసింగ్ సొసైటీలో బ‌య‌ట‌ప‌డిన ఈ వ్య‌వ‌హారం.. ఆ త‌ర్వాత చాలా మంది బాధితుల‌ను బ‌య‌ట‌కు తెచ్చింది. టిప్స్ సంస్థ పేరుతో తాము వ్యాక్సిన్ వేస్తామంటూ వ‌చ్చిన కొంద‌రు.. మే నెల‌లోనే వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్ పూర్తిచేశారు.

అయితే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇప్ప‌టి వ‌ర‌కూ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌లేదు. అంతేకాదు.. కొవిన్ యాప్ లో కూడా వీరి పేర్లు రిజిస్ట‌ర్ కాలేదు. దీంతో.. అనుమానం మొద‌లైంది. ఈ విష‌య‌మై ప‌లువురు పోలీసులను ఆశ్ర‌యించ‌డంతో.. ఈ ఫేక్ వ్యాక్సిన్ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. దీంతో.. త‌మ‌కు కూడా ధృవ‌ప‌త్రాలు ఇవ్వ‌లేదంటూ చాలా మంది చెప్పారు.

వ్యాక్సిన్ వేస్తామంటూ వ‌చ్చిన ఏజెన్సీల నిర్వాహ‌కులు కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. వారికి టీకా వేశారా? సెలైన్ వాటర్ ఎక్కించారా? అనే సందేహం కూడా వ్య‌క్తం చేస్తున్నారు చాలా మంది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ర‌మేష్ తౌరానీ హ‌స్తం ఉన్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టిప్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ సంస్థ‌కు హెడ్ గా ఉండ‌డంతో ఆయ‌నపై సందేహం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కేసు విష‌యంలో ఇప్ప‌టికే న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ న‌లుగురు గ‌తంలోనూ ఇదే త‌ర‌హా కేసులోప‌ట్టుబ‌డిన‌ట్టు తెలుస్తోంది. దీంతో.. పూర్తి వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు ముంబై పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.
Tags:    

Similar News