ఫోక‌స్‌: క‌మెడియ‌న్స్ కొర‌త‌

Update: 2018-12-04 01:30 GMT
టాలీవుడ్‌ ని క‌మెడియ‌న్ల కొర‌త వేధిస్తోందా?  జ‌న‌రేష‌న్ గ్యాప్‌తో కొత్త క‌మెడియ‌న్లు పుట్టుకొస్తున్నా.. ఎందుక‌నో స్టార్ క‌మెడియ‌న్‌ లు ప‌రిశ్ర‌మ‌లో క‌రువ‌య్యారా? అంటే అవుననే తాజా స‌న్నివేశం చెబుతోంది. రేలంగి.. రాజబాబు.. ప‌ద్మ‌నాభం.. అల్లు రామ‌లింగ‌య్య ఇలా సీనియ‌ర్లు అంతా స్టార్ క‌మెడియ‌న్లుగా ఏలారు ఆరోజుల్లో. ఆ త‌ర్వాత సుత్తి వీర‌భ‌ద్రం - సుత్తివేలు - క‌ళ్లు చిదంబ‌రం - బాబుమోహ‌న్ - సుధాక‌ర్ - ధ‌ర్మ‌వ‌ర‌పు - ఎం.ఎస్‌.నారాయ‌ణ‌ - బ్ర‌హ్మానందం - ఏవీఎస్‌ - అలీ - వేణుమాధ‌వ్ - గుండు హ‌నుమంత‌రావు - ఎల్‌ బి శ్రీ‌రామ్ - జీవా - కృష్ణ భ‌గ‌వాన్ .. ఇలా జ‌న‌రేష‌న్ గ్యాప్‌ ల‌తో టాప్ క‌మెడియ‌న్స్ వ‌చ్చి వెళ్లారు. కొంద‌రు కాలం చేసి క‌నుమ‌రుగైతే - మ‌రికొంద‌రు సినిమాల‌కు దూర‌మ‌వ్వ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

ఇటీవ‌లి కాలంలో బ్ర‌హ్మీ - అలీ బుల్లితెర‌కు అంకిత‌మ‌య్యారు. పెద్ద‌తెర‌కు కాస్త దూరంగానే ఉంటున్నారు. సునీల్ హీరో అయ్యి ఆ త‌ర్వాత కమెడియ‌న్ పాత్ర‌ల‌కు దూర‌మై తిరిగి వ‌చ్చాడు. వీళ్ల ప్ర‌భావం ఇప్పుడేమీ క‌నిపించ‌లేదు. నేటిత‌రం క‌మెడియ‌న్ల‌లో అంత విష‌యం ఉన్న క‌మెడియ‌న్లు ఎవ‌రున్నారు? అంటే ఫ‌టాప‌ట్ ప‌ది పేర్లు అయినా చెప్ప‌లేని ప‌రిస్థితి. కొంత‌లో కొంత జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్‌ లు ఆ రోల్ పోషిస్తున్నా.. స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మీ - అలీ రేంజు అని చెప్ప‌లేని స‌న్నివేశం నెల‌కొంది. ఇదో ర‌కం సుప్తావ‌స్థ ద‌శ అనే చెప్పాలి.  సాలిడ్‌ గా నిల‌బ‌డే క‌మెడియ‌న్లు క‌నిపించ‌డం లేదన్న విమ‌ర్శ ఉంది.

నేటి జ‌న‌రేష‌న్ ప‌రిశీలిస్తే.. ర‌ఘుబాబు - 30 ఇయ‌ర్స్ పృథ్వీ - శ్రీ‌నివాస్ రెడ్డి - ప్ర‌భాస్ శీను - వేణు - స‌ప్త‌గిరి - వెన్నెల కిషోర్ - తాగుబోతు ర‌మేష్ - ధ‌న్‌ రాజ్ - గౌత‌మ్ రాజు - భ‌ద్రం - ప్ర‌వీణ్‌ - ప్రియ‌ద‌ర్శి - స‌త్య‌ - ష‌క‌ల‌క శంక‌ర్ - చంద్ర‌ - ర‌ఘు కారుమంచి... ఇంత‌మంది క‌మెడియ‌న్లు నిరంత‌రం సినిమాలు చేస్తూ సంద‌డి తెస్తున్నారు. కానీ వీళ్ల‌లో ఎంద‌రు పెద్ద స్థాయి క‌మెడియ‌న్లు అన్న‌ది కాస్తంత గంద‌ర‌గోళ‌మే. ఇప్పుడున్న వాళ్లంతా క‌మెడియ‌న్లుగా బిజీగానే ఉన్నా.. పీక్స్‌ ని చూపించ‌గ‌లుగుతున్నారా? అన్న‌ది ఓ ప్ర‌శ్న‌. ర‌ఘుబాబు - 30 ఇయ‌ర్స్ పృథ్వీ - వెన్నెల కిషోర్ - ప్రియ‌ద‌ర్శి - స‌త్య‌ లాంటి కొంద‌రిని మిన‌హాయిస్తే.. ఇత‌రుల్లో ఎంద‌రు గుర్తున్నారు?  కొంద‌రు హీరోలై అభిమానుల‌కు దూర‌మ‌య్యారు. వీళ్లంతా  బ్ర‌హ్మీ - సునీల్ - అలీ రేంజు వేవ్‌ ను చూపించ‌డంలో ఎందుకో త‌డ‌బ‌డుతున్నారు. అయితే ప్ర‌తిభ ఉన్నా వీళ్ల‌ను జంధ్యాల‌ - ఈవీవీ రేంజులో చూపించే వాళ్లు లేక‌పోవ‌డం కూడా ఓ పెద్ద స‌మ‌స్య‌. ఇటీవ‌లి కాలంలో కామెడీలు చేయిస్తున్న డైరెక్ట‌ర్లంతా సెన్సిబిలిటీస్ స‌రిగా లేక‌ ఫ్లాప్‌ ల‌వ్వ‌డం క‌మెడియ‌న్లకు పెద్ద‌ మైన‌స్‌ గా మారింది. కామెడీ బేస్డ్ సినిమాలు తీసే శ్రీ‌నువైట్ల పెద్ద ఫ్లాప్ షో చూపించ‌డం మైన‌స్. ఒక్క‌ అనీల్ రావిపూడి మిన‌హా ఎవ‌రూ క‌మెడియ‌న్ల‌లో పూర్తి కాలిబ‌ర్‌ ని చూపిస్తున్న‌దే లేదు. కొత్త త‌రం ద‌ర్శ‌కుల్లో పూర్తి స్థాయి కామెడీని ఎలివేట్ చేసే వాళ్లు - పూర్తి కామెడీ సినిమాలు తీసేవాళ్లు పెరిగితేనే క‌మెడియ‌న్ల‌కు మ‌హ‌ర్ధ‌శ మొద‌ల‌వుతుందేమో?
Tags:    

Similar News