ఐదు షోలతో ఎవరికి లాభం?

Update: 2017-09-15 04:21 GMT
మొత్తానికి ఏడాది నుంచి చర్చల దశలో ఉన్న ప్రతిపాదన ఓకే అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్లోనూ ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఐతే అదనపు షో వల్ల ఎవరికి ప్రయోజనం.. దీని అసలు ఉద్దేశం ఫలిస్తుందా అన్న చర్చ నడుస్తోందిప్పుడు. చిన్న సినిమాలకు థియేటర్లు సరిపోని నేపథ్యంలో వాటికి మంచి జరగొచ్చన్న ఉద్దేశంతో ఐదో షోకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆ ఆలోచనతోనే ప్రభుత్వానికి ఈ విన్నపం చేశారు. మరి నిజంగానే అదనపు షోను చిన్న సినిమాలకు కేటాయిస్తారా? ఈ నిర్ణయంతో చిన్న సినిమాల సమస్య తీరిపోతుందా అన్నది ప్రశ్న.

ఐదో షోకు అనుమతి ఇవ్వడంతో చిన్న సినిమాల నిర్మాత ఫీలింగ్ ఎలా ఉందో కానీ.. బడా నిర్మాతలే చాలా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పెద్ద సినిమాలకు వారాంతంలో వసూళ్లు పెంచుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. వాటికి మంచి హైప్ ఉంటుంది కాబట్టి వీకెండ్లో అదనపు షోల వల్ల అదనంగా ఆదాయం సమకూరుతుంది. టాక్‌ తో సంబంధం లేకుండా వారాంతంలో హౌస్ ఫుల్స్ పడతాయి కాబట్టి పెద్ద సినిమాలు పండగ చేసుకోవచ్చు. ఈ అదనపు షో సౌలభ్యాన్ని పెద్ద సినిమాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాయనడంలో సందేహం లేదు. ఈ రోజుల్లో నెలలో వారాంతాలైనా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం వాటికే ఎక్కువ మేలు చేస్తుంది. థియేటర్లు కొంతమంది గుప్పెట్లో ఉన్న నేపథ్యంలో అదనపు షో వచ్చినంత మాత్రాన చిన్న సినిమాలకు మేలు జరిగిపోతుందా.. గొప్ప మార్పేమైనా వచ్చేస్తుందా అంటే సందేహమే?


Tags:    

Similar News