'ఘంట‌సాల' పై కుటుంబ‌స‌భ్యుల కేసు?

Update: 2018-10-05 14:55 GMT
ప్ర‌స్తుతం తెలుగులో బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ హీరోయిన్ సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి`బ‌యోపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో....మ‌రిన్ని బ‌యోపిక్ లు తెర‌కెక్కించేందుకు టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ - వైఎస్ బ‌యోపిక్ లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ బ‌యోపిక్ లు తీసే ముందు వారి కుటుంబ స‌భ్యుల అనుమ‌తి తీసుకోవ‌డం ఆన‌వాయితీ. కానీ, లెజెండ‌రీ సింగ‌ర్ - మ్యుజీషియ‌న్ ఘంట‌సాల బ‌యోపిక్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాత్రం ఆ ప్రాథ‌మిక సూత్రాన్ని విస్మ‌రించారు. దీంతో, ఘంట‌సాల త‌న‌యుడు ర‌త్న‌కుమార్....ఆ చిత్ర యూనిట్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ బయోపిక్ తీయ‌వ‌ద్దంటూ చెప్పినా....వినిపించుకోకుండా సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేయ‌డంతో ర‌త్న కుమార్ ...కోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఘంట‌సాల హార్డ్ కోర్ ఫ్యాన్ సీ హెచ్ రామారావు ఆయ‌న జీవిత చ‌రిత్ర‌పై ఓ పుస్త‌కం రాశారు. దాని ఆధారంగా బ‌యోపిక్ తీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఏడాది ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి అనుమ‌తి కోరారు. కానీ, అందుకు వారు నిరాక‌రించారు. అయితే, షూటింగ్ పూర్తి చేసి సినిమాను చూపించి వారిని క‌న్విన్స్ చేద్దామ‌ని రామారావు భావించారు. కృష్ణ చైత‌న్య‌, ఆయ‌న భార్య మృదుల లీడ్ రోల్స్ లో ఆ బయోపిక్ ను దాదాపు 80 శాతం తెర‌కెక్కించిన త‌ర్వాత వారి కుటుంబ స‌భ్యుల‌కు చూపించారు. అనుమ‌తి లేకుండా చిత్రీక‌రించ‌డంతో పాటు, ఆ చిత్రంలో ఘంట‌సాల పాత్ర‌ను చూపించిన విధానం వారికి న‌చ్చ‌లేద‌ట‌. దీంతో, రామారావుపై కోర్టులో కేసు దాఖ‌లు చేసేందుకు ర‌త్నకుమార్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఎవ‌రైన వ్య‌క్తి బ‌యోపిక్ తీసేందుకు వారి కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి కాద‌ని మ‌రి కొంద‌రు వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఘంట‌సాల బ‌యోపిక్ రిలీజ్ పై సర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డింది.

Tags:    

Similar News