'హరి హర వీరమల్లు' అప్డేట్: పాత పోస్టర్ పై కొత్త రిలీజ్ డేట్..!

Update: 2021-09-02 07:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''హరి హర వీరమల్లు''. ఇది పవన్ నటిస్తున్న తొలి చారిత్రాత్మక చిత్రం.. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే సినిమా. అందుకే ఈ ప్రాజెక్ట్ పై పీకే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. బందిపోటు తరహా పాత్రలో సరికొత్త లుక్ లోకనిపించి ఫ్యాన్స్ ని అలరించారు. ఈ క్రమంలో పవన్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందని అందరూ భావించారు.

ఇప్పటికే 'భీమ్లా నాయక్' నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేయడంతో.. ''హరి హర వీరమల్లు'' నుంచి కొత్త పోస్టర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు. అయితే పవన్ బర్త్ డే స్పెషల్ గా పాత పోస్టర్ మీద కొత్త రిలీజ్ డేట్ వేసి సరిపెట్టారు. పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇంతకముందు 2022 సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనవరికి 'భీమ్లా నాయక్' వస్తుంటే.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో వీరమల్లు ను తీసుకొస్తున్నారు. 'కేజీయఫ్ 2' రిలీజ్ అయిన రెండు వారాలకు పవన్ సినిమా వస్తుండటం గమనార్హం.

ఇకపోతే ''హరి హర వీరమల్లు'' నుంచి న్యూ పోస్టర్ వస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం నుంచి మరేదైనా అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కోహినూర్ వజ్రం నేపథ్యంలో మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ - బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ - మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


Tags:    

Similar News