పీకే రీమేక్ స్టార్ గా మారిపోయారా?

Update: 2022-03-02 01:30 GMT
టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ స్టార్ గా మారిపోయారా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌తీ సినిమా దాదాపు రీమేక్ మూవీనే కావ‌డం గ‌మ‌నార్హం. `అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ‌బ్బాయి` సినిమాతో ప‌వ‌ర్ స్టార్ కెరీర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

ఇది బాలీవుడ్ రీమేక్ ఆధారంగా రూపొందింది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ , జూహీ చావ్లా న‌టించిన `ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్` ఆధారంగా ఈ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తెర‌కెక్కించారు.  

ఈ మూవీ త‌రువాత క్యారెక్ట‌ర్ ప‌రంగా కొత్త‌గా వుండాల‌ని ప‌వ‌న్ చేసిన చిత్రం `గోకులంలో సీత‌`. రాశి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బ‌య్య తెర‌కెక్కించారు. 1997లో వ‌చ్చిన ఈ మూవీ ప‌వ‌న్ కు మంచి విజ‌యాన్ని అందించి హీరోగా ఆయ‌న కెరీర్ కి ప్ల‌స్ గా మారింది. ఈ మూవీ కూడా రీమేకే కావ‌డం విశేషం.

త‌మిళంలో `అభినంద‌న‌` ఫేమ్ కార్తీక్‌, సువ‌ల‌క్ష్మీ జంట‌గా న‌టించిన `గోకులతిల్ సీతై` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అగ‌స్త్య‌న్ దర్శ‌క‌త్వం వ‌హించారు. దీని త‌రువాత చేసిన `సుస్వాగ‌తం` ప‌వ‌న్ ని స్టార్ గా మార్చి యూత్ లో హ్యూజ్ క్రేజ్ ని క్రియేట్ చేసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ ని మ‌లుపు తిప్పిన తొలి ప్రేమ‌, `బ‌ద్రీ` ఒరిజిన‌ల్ స్టోరీస్‌ కాగా ఆ త‌రువాత చేసిన `త‌మ్ముడు` చిత్రాన్ని బాలీవుడ్ మూవీ `జో జీతా వ‌హీ సికంద‌ర్‌` స్ఫూర్తితో రూపొందించారు. ఈ మూవీ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచి ప‌వ‌న్ కు యూత్ లో భారీ క్రేజ్ ఏర్ప‌డేలా చేసింది. త బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని అందించి యూత్ లో తిరుగులేని స్టార్ గా నిల‌బెట్టింది. ఇక 2001 లో వ‌చ్చిన `ఖుషీ` చిత్రం త‌మిళంలో స్టార్ హీరో విజ‌య్ న‌టించిన `ఖుషీ` ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన విష‌యం తెలిసిందే.

ఇక 2006 లో వ‌చ్చిన `బంగారం` ఒరిజిన‌ల్ స్టోరీ కాగా `అన్న‌వ‌రం` త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `తిరుపాచ్చి` ఆధారంగా తెర‌కెక్కింది. త‌మిళ చిత్రం త‌ర‌హాలో తెలుగులో `అన్న‌వ‌రం` ఆక‌ట్టుకోలేక‌పోయింది. జ‌ల్సా, పులి ఒరిజిన‌ల్ స్క్రీప్ట్ లు కాగా `తీన్ మార్‌` చిత్రాన్ని బాలీవుడ్ మూవీ `ల‌వ్ ఆజ్ క‌ల్` ఆధారంగా రీమేక్ చేశారు. హిందీతో పోలిస్తే తెలుగు రీమేక్ ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇందులో తొలిసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్విపాత్రాభిన‌యం చేశారు.

ఇక ఆ త‌రువాత ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందుకుంది మాత్రం మ‌రో రీమేక్ మూవీ వ‌ల్లే కావ‌డం గ‌మ‌నార్హం. `పంజా` త‌రువాత ప‌వ‌న్ న‌టించిన చిత్రం `గ‌బ్బ‌ర్ సింగ్‌`. ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ చిత్రం `ద‌బాంగ్‌`కి రీమేక్ గా చేశారు. ఈ చిత్రం ప‌వ‌న్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఆ త‌రువాత చేసిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, అత్తారింటికి దారేది చిత్రాలు ఒరిజిన‌ల్ స్క్రిప్ట్ ల‌తో రూపొందాయి. ఈ రెండు చిత్రాల్లో `అత్తారింటికి దారేది` చిత్రం ప‌వ‌న్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించి స‌రికొత్త రికార్డులు సృష్టించింది.

`స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` ని మిన‌హాయిస్తే `గోపాల గోపాల‌`..కాట‌మ రాయుడు...వ‌కీల్ సాబ్‌.. రీసెంట్ గా వ‌చ్చిన `భీమ్లానాయ‌క్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. `భీమ్లానాయ‌క్‌` ని మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.

`అక్క‌డ‌మ్మాయి ఇక్క‌డ‌బ్బాయి` నుంచి `భీమ్లానాయ‌క్‌` వ‌ర‌కు ప‌వ‌న్ న‌టించిన అత్య‌ధిక చిత్రాలన్నీ రీమేక్ లు కావ‌డంతో పీకే రీమేక్ స్టార్ గా మారిపోయారంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ చ‌ర్చ జ‌రుగుతుండ‌టం విశేషం. రీమేక్ ఆధారంగా తెర‌కెక్కిన‌ `భీమ్లానాయ‌క్‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మూవీ త‌రువాత కూడా మ‌రో త‌మిళ రీమేక్ ని త్రివిక్ర‌మ్ తో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News