డిజాస్టరే.. కానీ డబ్బులొచ్చేశాయట

Update: 2015-09-14 15:30 GMT
రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల గురించి ఎవరైనా తిట్టిపోస్తే ఆయనకు భలే కోపం వచ్చేస్తుంటుంది. నా సినిమా పెట్టుబడి ఎంతో తెలుసా.. దానికొచ్చిన ఆదాయమెంతో తెలుసా.. అని లెక్కలు తీసి అవతలి వాళ్లకు ఉతికారేస్తుంటాడు వర్మ. నిజమే.. వర్మ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ కావడం అరుదు. ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది మరి. ఒకప్పుడు వర్మ దగ్గర సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన డైరెక్టర్ తేజ కూడా ఈ ఫార్ములానే అనుసరించినట్లున్నాడు. ‘హోరాహోరీ’ సినిమాకు దారుణమైన టాక్ వచ్చినా.. రెండో రోజు నుంచే థియేటర్ లు వెలవెలబోయినా.. ఆ సినిమా నిర్మాతకు కానీ.. బయ్యర్లకు కానీ నష్టాలు లేవని సమాచారం.

వర్మ తరహాలోనే తేజ ఎంచుకున్న స్ట్రాటజీనే ‘హోరాహోరీ’ని సేఫ్ వెంచర్ గా నిలబెట్టింది. ఈ సినిమాకు కనీసం కోటి రూపాయలు కూడా బడ్జెట్ కాలేదని సమాచారం. హీరో హీరోయిన్ లకు రెమ్యూనరేషనే లేదు. మిగతా నటీనటులకు ఇచ్చింది కూడా చాలా తక్కువ. సాంకేతిక నిపుణులు కూడా ఖరీదైన వాళ్లేమీ కాదు. ఇక ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా పొదుపుగా ఉన్నారు. ఓ పాతికమంది మాత్రమే యూనిట్ లో పని చేశారు. వసతి, భోజనం విషయాల్లో కూడా అతి చేయలేదు. వరుస ఫ్లాపుల తర్వాత కూడా తనను నమ్మి పెట్టుబడి పెట్టినందుకు మినిమం బడ్జెట్ తో సినిమా పూర్తి చేసిచ్చాడు తేజ. ఇక విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్ కూడా చేసింది లేదు. ఆడియో ఫంక్షన్ లో, ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ లో సెన్సేషనల్ కామెంట్లు చేయడం ద్వారా తేజ కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టాడు. సినిమాను అమ్మడమే చాలా తక్కువ రేట్లకు అమ్మారు. ఆ మొత్తం ఓపెనింగ్స్ తోనే రికవరీ అయిపోయింది. ఆ విధంగా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ‘హోరాహోరీ’ ప్రాఫిటబుల్ వెంచర్ అయిందని సమాచారం.
Tags:    

Similar News