పిక్ టాక్: 'నాటు నాటు' సాంగ్ కు RRR హీరోల ఊర మాస్ స్టెప్పులు..!

Update: 2021-11-05 16:57 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన చిత్ర బృందం.. వరుస అప్డేట్స్ తో అభిమానులను ఖుషీ చేస్తున్నారు.

దీపావళి కానుకగా ఇప్పటికే 45 సెకండ్ల 'RRR గ్లింప్స్‌' ని రిలీజ్ చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లను విడివిడిగా చూపించిన జక్కన్న.. ఇందులో ఇద్దరినీ కలిపి చూపించారు. ఈ క్రమంలో పండుగ సంబరాలను రెట్టింపు చేయడానికి మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్ తో ముందుకు వచ్చారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలోని సెకండ్ సింగిల్ ని నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'నాటు నాటు' అంటూ సాగే ఈ పాట బ్లాస్టింగ్ బీట్స్ - హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్ అని మేకర్స్ పేర్కొన్నారు.

'నాటు నాటు' సాంగ్ కు ఎంఎం కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ పాటను తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా RRR హీరోలకు సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. 1920స్ కు తగ్గట్టుగా ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది. అందరూ హుషారుగా డ్యాన్స్ చేసేలా ఈ గీతం ఉండబోతోందో ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రధారులు ఇలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించడం ఆసక్తికరమనే చెప్పాలి. మరి నాటు నాటు పాట ఎలా ఉంటుందో చూడాలి.

RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో ఈ  పీరియాడికల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్ గణ్ - సముద్ర ఖని - శ్రియా శరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News