పొకిరిని అందుకే మిస్ చేసుకున్నా: కంగనా

Update: 2019-03-28 17:30 GMT
తనకు మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడడం బాలీవుడ్ క్వీన్ కంగనాకు అలవాటు. అలా మాట్లాడడం కొందరికి నచ్చుతుంది కానీ అలాంటి ముక్కుసూటితనమే వివాదాలలో చిక్కుకునేలా చేస్తుంది. అలా అని మాట్లాడడం ఆపేసే బాపతు కాదు కంగనా.  వివాదాలకు అవతలి వాళ్ళు జడుసుకొని నోరు మూసుకోవాలే కాని కంగనా మాత్రం అసలు కేర్ చెయ్యదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది కంగనా.

తన కెరీర్ ఆరంభంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహలాని నిర్మించే 'ఐ లవ్యూ బాస్' అనే సినిమాలో అవకాశం కోసం వెళ్లిందట.  తనకు అవకాశం ఇస్తామని చెప్పడంతో  ఫోటో షూట్ కోసం వెళ్ళిందట.  కానీ ఆ ఫోటోషూట్ ఒక చేదు అనుభవం అని చెప్పుకొచ్చింది. అదో శృంగార చిత్రం కావడంతో ఫోటో షూట్ కు లో దుస్తులు లేకుండా ఒక పారదర్శకమైన వస్త్రం ధరించి ఫోటోలు దిగాలని చెప్పారట.  ఆ ఫోటో షూట్ ను మధ్యలోనే వదిలేసి పారిపోవాలనిపించినా ఎలానో కష్టపడి ఫోటో షూట్ పూర్తి చేసిందట.  ఆసమయం లో హీరోయిన్  కెరీర్ వద్దని తనను వారించిన తల్లిదండ్రుల విషయం గుర్తొచ్చిందని తెలిపింది.  ఫోటో షూట్ ను ఎలాగో కష్టపడి కంప్లీట్ చేసినా.. అలాంటి సినిమాలో నటించలేక తన ఫోన్ నంబర్ మార్చేసి వారికి కనిపించకుండా ఎస్కేప్ అయిందట.  ఇంతకీ ఆ శృంగార భరిత చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలాని ఎవరో తెలుసు కదా.  ఈమధ్య కొంతకాలం క్రితం సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా వ్యవహరించి ఫిలింమేకర్లను బెంబేలెత్తించిన ఘనుడు.

తర్వాత 2006 లో 'గ్యాంగ్ స్టర్' సినిమాలో అవకాశం దొరికిందని తెలిపింది.  చిత్రమైన విషయం ఏంటంటే.. 'గ్యాంగ్ స్టర్' ఆడిషన్స్ కు హాజరయిన సమయంలో పూరి జగన్నాధ్ 'పోకిరి' కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారట. దీంతో 'పోకిరి' ఆడిషన్స్ లో కూడా హాజరయిందట.  రెండూ సినిమాలకు హీరోయిన్ గా సెలక్ట్ అయినా రెండిట్లో 'గ్యాంగ్ స్టర్' సినిమాను ఎంపికచేసుకున్నానని తెలిపింది.  కానీ కొంతకాలం తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ నిరంజన్' చిత్రంలో హీరోయిన్ గా నటించానని తెలిపింది. కంగనా మిస్ చేసుకున్న చిత్రాన్ని ఇల్లీ బేబీ పట్టేసింది.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లో టాప్ హీరోయిన్ అయ్యింది.
 
    

Tags:    

Similar News