రాజమౌళి ఫిలిం మేకర్ కాదు.. ఆయనొక క్రియేటర్..!

Update: 2022-03-20 05:30 GMT
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వేదికగా 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి - హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ సహా చిత్ర బృందం అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం బసవరాజు బొమ్మై ట్రిపుల్ ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

RRR చిత్రంతో రాజమౌళి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని.. ఆయన సినిమా మేకర్ కాదని.. ఆయనొక క్రియేటర్ అని బసవరాజు బొమ్మై పేర్కొన్నారు. తాను ఈ ఈవెంట్ కు రావడానికి ప్రధాన కారణం ఇది భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇద్దరు అన్ సంగ్ హీరోల కథతో తీసిన సినిమా కావడమేనని అన్నారు.

దేశవ్యాప్తంగా ఈ సినిమా సందడి చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.. అభినందిస్తున్నానన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR దేశం గర్వించదగ్గ చిత్రం అవుతుందని నమ్ముతున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూడవలసిందిగా కోరుతున్నాను. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ టికెట్ కొనుక్కొని సినిమా చూసి టీమ్ ని అభినందించాలి అని బసవరాజు పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్లలాంటివని.. అదే మన సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

రాజమౌళి తన చిత్రాలతో చరిత్ర లిఖించి ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేశారని.. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఘన విజయం సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల బంధం లాగే రామ్ చరణ్ - ఎన్టీఆర్ - శివరాజ్ కుమార్ స్నేహం కొనసాగాలని ఆకాక్షించారు.

భారత స్వాతంత్య్ర పోరాటయోధులకు ఈ చిత్రాన్ని అంకితమివ్వాలని కర్ణాటక సీఎం ప్రత్యేకంగా అభ్యర్థించారు. ''స్వాతంత్య్ర సమరయోధులైన భగత్ సింగ్ - సుభాష్ చంద్రబోస్ - చంద్రశేఖర్ ఆజాద్ - కిత్తు రాణి చెనమ్మ - లాలా లజపతిరాయ్ -ఝాన్సీ లక్ష్మీబాయ్ వంటి అసామాన్యులకు ఆర్ఆర్ఆర్ ను అంకితం చేయాలని రాజమౌళిని కోరుతున్నాను'' అని అన్నారు.

సీఎం బసవరాజ్ ఈ సందర్భంగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు. “స్వామి వివేకానంద చెప్పినట్లుగా, సాధకుడికి మరణం అంతం కాదు. మరణం తర్వాత జీవించే మనిషి నిజమైన సాధకుడు. పునీత్ నిజమైన సాధకుడు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉండే వరకు పునీత్ రాజ్ కుమార్ జీవించి ఉంటాడు'' అని అన్నారు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో 25 మార్చి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News