కీర్తి సురేష్ సొంత సినిమా ప్రారంభం..!

Update: 2021-11-19 15:30 GMT
'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన కీర్తి.. 'మహానటి' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు పాత్ర నచ్చితే హీరో చెల్లెలిగా కనిపించడానికి కూడా కీర్తి వెనుకాడటం లేదు. ఇప్పటికే అర డజను చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్టుగా మరో సినిమాని ప్రారంభించింది. అది కూడా తమ హోమ్ బ్యానర్ లో సినిమా అవడం విశేషం.

కీర్తి సురేశ్ తల్లిదండ్రులు కూడా సినీ నేపథ్యం ఉన్నవారే అనే సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ప్రముఖ మలయాళ నిర్మాత సురేష్ కుమార్. తల్లి మేనక అలనాటి హీరోయిన్. వీరిద్దరూ అప్పట్లోనే 'రేవతి కళామందిర్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. కీర్తి తన సొంత బ్యానర్ లో 'పైలట్స్' అనే సినిమలో చైల్డ్ ఆర్టిస్ట్‌ గానూ నటించింది. అయితే హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం హోమ్ బ్యానర్ లో సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు తన తల్లిదండ్రుల నిర్మాణంలో సినిమా చేస్తోంది. 'వాశి' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మలయాళ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

'వాషి' సినిమాలో వర్సటైల్ టొవినో థామస్ హీరోగా నటించనున్నారు. ఆయనకు జోడీగా కీర్తి సురేష్ కనిపించనుంది. విష్ణు జి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 26 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సొంత బ్యానర్‌ లో సినిమా చేస్తుండటంపై కీర్తి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నటించిన 'పెద్దన్న' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే క్రమంలో 'గుడ్ లక్ సఖి' 'మరక్కార్ అరబికదలింటే సింహం' సినిమాలు డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్నాయి. కీర్తి లీడ్ రోల్ ప్లే చేసిన 'సాని కాయిదమ్' సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న 'సర్కారు వారి పాట'.. నాని తో చేస్తున్న 'దసరా' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక చిరంజీవి చెల్లెలుగా కీర్తి నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది.
Tags:    

Similar News