మెగా 152లో సీనియర్‌ కాదు జూనియర్‌

Update: 2019-04-12 12:51 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న చిరంజీవి త్వరలోనే కొరటాల మూవీలో నటించనున్నాడు. కొరటాల శివ ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. శ్రీమంతుడు - భరత్‌ అనే నేను చిత్రాలు ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచాయి. అంతటి విజయాలను దక్కించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో మూవీ అనగానే మెగా ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా పెట్టుకున్నారు.

అంచనాలకు తగ్గట్లుగా - ఏ విషయంలో కూడా తగ్గకుండా రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు  గాను అనుష్క - నయనతార - శ్రియతో పాటు ఇంకా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవికి జోడీగా సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ కాకుండా జూనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన కీర్తి సురేష్‌ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో అజయ్‌ దేవగన్‌ వంటి స్టార్‌ హీరోతో నటిస్తున్న కీర్తి సురేష్‌ తెలుగులో చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయంకు కొరటాల వచ్చినట్లుగా తెలుస్తోంది. కీర్తి సురేష్‌ వయసు రీత్యా చూసుకుంటే మాత్రం చిరంజీవికి జోడీగా ఏమాత్రం బాగుండదనే అభిప్రాయంను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరు 152వ చిత్రంలో కీర్తి ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి - పోయాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో అనేది అధికారిక ప్రకటన వస్తే కాని తెలియదు.
Tags:    

Similar News