వ‌రుస 100 కోట్ల క్ల‌బ్ లతో మోతెక్కిస్తున్న‌ సౌత్

Update: 2022-04-17 08:30 GMT
వైర‌స్ ఉప్పెన వెల‌సింది. సౌత్ సినిమా మెరిసింది. క‌రోనా కోర‌లు కొన్నాళ్ల పాటు విషం చిమ్మినా కానీ వినోద ప‌రిశ్ర‌మ గెలుపును ఆప‌లేద‌ని ప్రూవ్ అయ్యింది. మ‌హ‌మ్మారీ వెళ్లాక‌.. కేవలం రెండు వారాల గ్యాప్ లో వ‌చ్చిన రెండు సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. వీటిలో ఇటీవ‌ల సౌత్ నుంచి వ‌చ్చి హిందీ మార్కెట్లో అద్భుత వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 ఉన్నాయి.

కేవ‌లం తొలి వీకెండ్ లోనే 200కోట్లు పైగా వ‌సూళ్ల‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. కేవ‌లం హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమాలు తొలి వీకెండ్ లో నే 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. క్రైసిస్ అనంత‌రం ఇవి సంచ‌ల‌న విజ‌యాలుగా న‌మోద‌య్యాయి. ఆర్.ఆర్.ఆర్ ముందు ఇంకేదీ నిల‌వ‌లేదు. హిందీ బాక్సాఫీస్ గ‌డ‌గ‌డ‌లాడింది.

మూడు వారాల పాటు ఎదురే లేకుండా ఆర్.ఆర్.ఆర్ హ‌వా సాగింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 క్రేజ్ హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఇత‌ర సినిమాల్ని డామినేట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  కొన్ని థియేట‌ర్ల‌లో అద‌నంగా కుర్చీలు యాడ్ చేయాల‌ని ప్రేక్ష‌కులు డిమాండ్ చేశార‌ని హిందీ వెబ్ సైట్లు పేర్కొన‌డం మూవీ క్రేజ్ ని వెల్ల‌డిస్తోంది.

ఇక ఇప్ప‌ట్లో సౌత్ సినిమాని డామినేట్ చేసేవి బాలీవుడ్ లో తీయ‌గ‌ల‌రా? అనేంత‌గా వేవ్ క్రియేటైంది. అదే క్ర‌మంలో షారూక్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి మ‌రో ప్ర‌యోగాన్ని సౌత్ డైరెక్ట‌ర్ తో క‌లిసి చేస్తున్నారు. ఇంత‌లోనే స‌ల్మాన్ భాయ్ కూడా అదే త‌ర‌హాలో సౌత్ - నార్త్ క్రాస్ ల‌వ్ స్టోరీతో సౌత్ - నార్త్ బాక్సాఫీసుల్ని జాయింట్ గా కొల్ల‌గొట్టాల‌ని గేమ్ ఛేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జోరందుకున్నాయి. ఇక మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. అక్ష‌య్ కుమార్ .. అజ‌య్ దేవ‌గ‌న్ కూడా ఇదే బాట‌ను అనుస‌రించే వీలుంద‌ని భావిస్తున్నారు. ఒక‌సారి గ‌తం ప‌రిశీలిస్తే .. హిందీ స్టార్ల‌కు తెలుగు సినిమా చుక్కానీ లాంటిద‌ని అర్థ‌మ‌వుతుంది.

టాప్ టాలీవుడ్ రీమేక్స్ తోనే..

ఖాన్ ల త్ర‌య‌మే కాదు ఎంద‌రో బాలీవుడ్ స్టార్లు కేవ‌లం టాలీవుడ్ సినిమాల రీమేకుల్లో న‌టించి వంద కోట్ల క్ల‌బ్ హీరోలుగా వెలిగారు. ఇది నిజంగానే టాలీవుడ్ స్టామినాకి చిహ్నంగా నిలిచింది. సల్మాన్ ఖాన్ నుండి షాహిద్ కపూర్ వరకు సూపర్ హిట్ అయిన టాలీవుడ్ సినిమాల‌తోనే అరుదైన వంద కోట్ల క్ల‌బ్ అందుకున్నారు. సౌత్ ద‌ర్శ‌కులే స‌ల్మాన్ - షాహిద్ లాంటి హీరోల‌కు అంతటి ఘ‌న‌కీర్తిని ఆపాదించారు.

టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌న్నీ చాలా కాలంగా హిందీలో రీమేక‌వుతున్నాయి. పోకిరి- రెడీ- కిక్- స్టాలిన్ స‌హా  తమిళ మలయాళ పరిశ్రమకు చెందిన అనేక ఇతర సినిమాలను తిరిగి నిర్మించిన తరువాత సల్మాన్ ఖాన్ విజయంతో మెరుస్తున్నాడు. తెలుగు హిట్ అర్జున్ రెడ్డి రీమేక్ తో షాహిద్ కపూర్ 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించగలిగాడు. బాలీవుడ్ స్టార్లంతా ఇప్పుడు ఇటువైపే చూస్తున్నారు.

బాలీవుడ్‌లో రీమేక్ చేయబోయే రాబోయే తెలుగు సినిమాల జాబితా చూస్తే షాహిద్ కపూర్ జెర్సీ రీమేక్ లో న‌టిస్తున్నారు. నాని పోషించిన పాత్ర‌ను షాహిద్ హిందీ రీమేక్ లో పోషిస్తున్నారు.  గౌతమ్ తిన్ననూరి రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  పేద-అబ్బాయి.. ధనవంతురాలు ప్రేమ కథలో ట్విస్టుల‌తో విలేజ్ నేపథ్యంలో ఆర్.‌ఎక్స్ 100 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

ఈ మూవీని హిందీలో `తడాప్` గా రీమేక్ చేసి రిలీజ్ చేయ‌గా ఫ‌ర్వాలేద‌నిపించింది. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో  సాజిద్ నాడియాద్వాలా నిర్మించారు. ఈ చిత్రంలో అహన్ శెట్టి - తారా సుతారియా నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. సునీల్ శెట్టి కుమారుడు అహన్ ఈ రీమేక్ తోనే బాలీవుడ్ లో అరంగేట్రం చేసాడు.

విశ్వక్ సేన్ న‌టించిన `హిట్` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సైలేష్ కోలను హిందీలోకి రీమేక్ చేస్తుండ‌గా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ `డియ‌ర్ కామ్రేడ్` రీమేక్ హక్కులను పొందారు. హిందీలో రీమేక్ క్యూలో ఉన్న‌వాటిలో బ్రోచేవారెవ‌రురా- నిను వేదాని నీడను నేను కూడా ఉన్నాయి. స‌ల్మాన్ .. అమీర్ .. షాహిద్ త‌ర‌హాలోనే మునుముందు వంద కోట్ల క్ల‌బ్ మ‌న సినిమాల వ‌ల్ల‌నే అందుకునే న‌వ‌త‌రం‌ హీరోలు ఎవ‌రు? అన్న‌ది కాస్త వేచి చూడాలి.
Tags:    

Similar News