నేను కూడా ఓటీటీకి అభిమానినే

Update: 2021-11-17 04:12 GMT
హైదరాబాద్ లో నిన్న 'ఇండియా జాయ్' పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ ఫెస్టివల్ జరిగింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్. తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ .. యానిమేషన్ ఎండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు పారిశ్రామిక వేత్తలు .. పెట్టుబడిదారులు .. యానిమేషన్ రంగ నిపుణులతో పాటు, నటుడు .. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.

ఈ వేదికపై కేటీఆర్ మాట్లాడుతూ .. తనని మంచి యాక్టర్ అని సుధీర్ బాబు అనడం పట్ల ఆయన సరదాగా స్పందించారు. సుధీర్ మాటలను తాను గుర్తుపెట్టుకుంటానని అన్నారు. పాజిటివ్ వేవ్ లో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు.

మంచి పోలిక అంటూ సుధీర్ బాబును అభినందించారు. 'ఇండియా జాయ్' మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమమనీ, దేశంలో రోజు రోజుకీ ఇంటర్నెట్ యూజర్లు పెరిగిపోతున్నారని అన్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4 శాతం పెరుగుతుందనేది ఒక అంచనా అనే విషయాన్ని గుర్తుచేశారు.

ఓటీటీ .. గేమింగ్ కు చాలా వేగంగా ఆదరణ పెరిగిపోతోందనీ, నిజానికి తాను కూడా ఓటీటీ అభిమాననే అని అన్నారు. వీక్షకులకు కావలసిన వినోదాన్ని అందించడంలో ఓటీటీ సక్సెస్ అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్లలో 10 వీఎఫెక్స్ సంస్థలు కొలువుదీరడం విశేషమని చెప్పారు.

హైదరాబాద్ లో 80 వీఎఫెక్స్ సంస్థలు ఉన్నాయనీ .. 'ఆత్మ నిర్భర్ భారత్'లో భాగంగా అనేక గేమ్స్ రూపొందాయని చెప్పారు. ఇమేజ్ టవర్ ను 2023లో ప్రారంభించడానికి కృషి చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News