మూవీ రివ్యూ : లాఠి

Update: 2022-12-22 11:34 GMT
‘లాఠి’ మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్-సునైనా-ప్రభు-రమణ-మునీష్ కాంత్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం-బాలకృష్ణ తోట
నిర్మాతలు: రమణ-నంద
రచన-దర్శకత్వం: వినోద్ కుమార్

తమిళంలో యాక్షన్ సినిమాలతో మంచి పేరు సంపాదించిన విశాల్ కు తెలుగులో కూడా ఒకప్పుడు మంచి ఫాలోయింగే ఉండేది. కానీ రొటీన్ మాస్ మసాలా సినిమాలతో అతను ఇక్కడ మార్కెట్ దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడతను ‘లాఠి’ అంటూ మరో మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుుక వచ్చాడు. మరి ఈ చిత్రమైనా విశాల్ రాత మార్చేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

మురళీ కృష్ణ (విశాల్) ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. తన లాఠీకి పని చెప్పి నేరస్థుల తాట తీయడంలో మంచి పేరున్న మురళీ.. ఒక కేసులో ఈ పనితనం వల్లే సస్పెండ్ అవుతాడు. అతి కష్టం మీద డీఐజీ రెకమండేషన్ ద్వారా తిరిగి డ్యూటీలో చేరిన మురళీ.. ఇకపై తన లాఠీకి పని చెప్పొద్దనుకుంటాడు. కానీ తాను మళ్లీ డ్యూటీ చేరడానికి సాయం చేసిన డీఐజీకి మురళీ ఓ సాయం చేయాల్సి వస్తుంది. ఆయన కూతుర్ని ఏడిపించి అవమానించిన వీరా అనే  రౌడీని చితకబాదాల్సిన పనిని మురళీకి అప్పగిస్తాడు డీఐజీ. తనెవరో తెలియనివ్వకుండా వీరాకు తన లాఠీతో బుద్ధి చెబుతాడు మురళీ. కానీ తర్వాత అత్యంత క్రూరుడైన వీరా తనను కొట్టిన వాడి కోసం వేట మొదలుపెడతాడు. మరి మురళీని అతను కనిపెట్టాడా.. అతణ్ని మురళీ ఎల ా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

విశాల్ ఒడ్డూ పొడుగు బాగుంటాడు. యాక్షన్ సినిమాలకు పర్ఫెక్టుగా సూటవుతాడు. అతనెళ్లి పది మందినో ఇరవై మందినో చితకబాదేస్తే ‘అతి’గా ఏమీ అనిపించదు. సినిమాల్లో ఫైట్లు అన్నాక మామూలుగానే ‘అతి’ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ విశాల్ వంద మందికి పైగా రౌడీలకు నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద భవనంలో దొరికిపోతే.. అతను అక్కడి నుంచి అడుగు బయటపెట్టడానికి వీల్లేకుండా అన్ని దారులూ మూసేసి రౌడీలందరూ చుట్టు ముట్టేస్తే.. వాళ్లందరినీ మట్టుబెట్టి విశాల్ అక్కడి నుంచి బయటకి అడుగేస్తే ఎలా ఉంటుంది..? విశాల్ చూడ్డానికి ఎంత ‘మ్యాచో స్టార్’లా కనిపించినా కూడా ఇది టూమచ్ కదా? అందులోనూ ఆ రౌడీలకు హీరోకు మధ్య పోరాటాన్ని ముప్పావు గంటకు పైగా నడిపిస్తే అది అతికే అతిలా అనిపించకుండా ఎలా ఉంటుంది? ‘లాఠి’ సినిమాలో ఇదే జరిగింది. కథ వరకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. ఒక దశ వరకు కథనం కూడా రియలిస్టిగ్గా.. ఆసక్తికరంగా సాగినా.. ఆ తర్వాత యాక్షన్ శ్రుతి మించి.. దానికి సెంటిమెంట్ డోస్ కూడా ఎక్కువై.. ఓవర్ డ్రమటిక్ అయిపోవడం వల్ల ‘లాఠి’ ధాటిని తట్టుకోవడం కష్టమే అవుతుంది.

విశాల్ చేసేది ఎక్కువగా యాక్షన్ సినిమాలే అయినా.. ‘అభిమన్యుడు’ సహా కొన్ని చిత్రాల్లో సరికొత్త కథలను ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడతను. ‘లాఠి’ విషయంలోనూ అతను కొంచెం భిన్నమైన రూట్లోనే వెళ్లాడు. మామూలుగా పోలీస్ కథలనగానే హీరోను ఎస్ఐ.. అంతకంటే పై అధికారి పాత్రల్లో చూపిస్తారు. వాస్తవానికి భిన్నంగా ఎగ్జాజరేషన్లతో హీరో పాత్రను నడిపిస్తారు. కానీ ‘లాఠి’ ఈ విషయంలో వేరే దారిలో నడుస్తుంది. హీరో ఇందులో ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్. డిపార్టుమెంట్లో లాఠి స్పెషలిస్టుగా అతడికి పేరుంటుంది. ఒక కేసులో పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్న నిందితుడి మీద ఒక గ్యాంగ్ దాడి చేయబోతుంటే.. వాళ్లకు లాఠీతో బుద్ధి చెప్పి అడ్డుపడి ఆ నిందితుడిని క్షేమంగా కోర్టుకు తీసుకెళ్లే సన్నివేశంతో హీరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది ఇందులో. ఇలా కొంచెం రియలిస్టిగ్గా అనిపించే సన్నివేశంతో.. టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చేలా ఆసక్తికరంగా మొదలవుతుంది ‘లాఠి’ సినిమా. తర్వాత లాఠీ ఛార్జ్ చేయడం వల్లే హీరో సస్పెండవడం.. అంతకుముందు కేసులో తన వీరత్వం చూసి మెచ్చిన అధికారి సాయంతో హీరో తిరిగి డ్యూటీలో చేరడం.. తన సస్పెన్షన్ ఎత్తివేయించిన అధికారి కోసం తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని మళ్లీ లాఠి పవర్ చూపించడడం.. ఈ థ్రెడ్ అంతా కూడా ఆసక్తికరంగా సాగుతుంది.

విలన్ పాత్ర ముఖం చూపించకుండా అతడి క్రూరత్వాన్ని పరిచయం చేయడం.. అంత క్రూరుడైన విలన్ని హీరో చితకబాది అతడికి హీరో టార్గెట్ గా మారడంతో కథ రసపట్టులో పడినట్లు కనిపిస్తుంది. హీరో కంటే కూడా విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. విలన్ తన ముఖం చూపించకుండానే ప్రేక్షకులను భయపెడతాడు. తనను కొట్టిన హీరో ఎవరో విలన్ కనిపెట్టడంతో ప్రథమార్ధం ముగుస్తుంది. అప్పటిదాకా విలన్ పాత్రకు ఇచ్చిన బిల్డప్ అదీ చూసి.. ఇక హీరోను అతను ఎలా టార్గెట్ చేస్తాడు.. హీరో అతణ్నెలా ఎదుర్కొంటాడు అని ఉత్కంఠ కలుగుతుంది. ఐతే అప్పటిదాకా ఇచ్చిన బిల్డప్ కి.. ఆ తర్వాత విలన్ పాత్రను చూపించిన విధానానికి పొంతన ఉండదు. ముఖం చూపించకుండా భయపెట్టే విలన్.. ఆ ముసుగు తొలిగిపోయాక మామూలుగా అనిపిస్తాడు. అంతలా ఆ క్యారెక్టర్ గ్రాఫ్ పడిపోతుంది.

ఇక హీరో విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా ఏమంత ఆసక్తి కలిగించదు. హీరోను విలన్ గుర్తించినంత వరకు ఉత్కంఠభరితంగా అనిపించే సినిమా.. గుర్తించాక మాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది. మనం ఏదో ఊహించుకుంటే దర్శకుడు మాత్రం హీరో-విలన్ గ్యాంగుని ఒక బిల్డింగ్ లో పడేసి వారి మధ్య పోరాటాన్ని చూపించాడు. ఇదొక సర్వైవల్ డ్రామాలా మారిపోయింది. ముందే చెప్పినట్లు అతికే అతి అనిపించేలా ఇక్కడ హీరో.. 100 ప్లస్ రౌడీలతో సుదీర్ఘంగా పోారాడే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులిచ్చి ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేసినా.. ఎంతకీ తెగనట్లుగా సాగే యాక్షన్ సన్నివేశాలు మాత్రం విసుగు తెప్పిస్తాయి. యాక్షన్ మోతనే తట్టుకోలేకపోతుంటే.. దానికి తోడు సెంటిమెంట్ డోస్ బాగా దట్టించేశాడు దర్శకుడు. ఇంకెప్పుడు ముగుస్తుందా అన్న ఫీలింగ్ కలిగించి ప్రథమార్ధంలో కలిగిన ఇంప్రెషన్ని  దెబ్బ తీస్తుంది ‘లాఠి’. లాజిక్కులతో సంబంధం లేకుండా ఎంత యాక్షన్ ఉంటే అంత ఎంజాయ్ చేస్తాం అనుకునేవాళ్లు.. సెంటిమెంటు డోస్ కూడా తట్టుకోగలిగిన వాళ్లు ‘లాఠి’ని ఓసారి ట్రై చేయొచ్చు కానీ.. మిగతా వాళ్లకు కష్టమే.

నటీనటులు:

విశాల్ కు పోలీస్ పాత్రలు కొట్టిన పిండే. ఎక్కువగా ఆఫీసర్ పాత్రల్లో నటించిన అతను.. ఈసారి కానిస్టేబుల్ గానూ రాణించాడు. పాత్రకు తగ్గట్లుగా అతడి నటన సాగింది. కానీ వయసు 45 ఏళ్లకు వచ్చేయడంతో ఇంతకుముందులా ఫిజిక్ మెయింటైన్ చేయలేకపోతున్నట్లున్నాడు. ఔట్ ఆఫ్ షేప్ అయిపోయిన అతను చాలా చోట్ల చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతను ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సునైనా మెప్పించింది. ఇంత అందం.. టాలెంట్ ఉన్న అమ్మాయిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదే అనిపిస్తుంది తనను చూస్తుంటే. సీనియర్ నటుడు ప్రభు తనకు తగ్గ పాత్రలో ఓకే అనిపించాడు. విలన్ పాత్రకు రమణ సూట్ కాలేదనిపిస్తుంది. గతంలో హీరోగా.. క్యారెక్టర్ నటుడిగా కనిపించిన అతను.. విలన్ పాత్రను సరిగ్గా పండించలేకపోయాడు. లుక్స్ మీద పెట్టిన శ్రద్ధ మిగతా వాటి మీద లేకపోయింది. మునీష్ కాంత్ ఓకే.

సాంకేతిక వర్గం:

విశాల్ నటించిన యాక్షన్ సినిమాల్లో చాలా వాటికి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బలంగా మారిన యువన్ శంకర్ రాజా.. ఈ చిత్రంలోనూ ఆర్ఆర్ వరకు మెప్పించాడు. సినిమాలో ఇంటెన్సిటీకి తగ్గట్లుగా అతడి బీజీఎం సాగింది. పాటలు పర్వాలేదు. బాలసుబ్రహ్మణ్యం-బాలకృష్ణ అందించిన ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వినోద్ ఎంచుకున్న కథ బాగుంది. లాఠి అని టైటిల్ పెట్టి.. ఆ లాఠికి కథలో ఇచ్చిన ప్రాధాన్యం బాగుంది. ఒక దశ వరకు కథను ఆసక్తికరంగా చెప్పాడు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకున్నాడు. కానీ ఫైనల్ యాక్ట్ విషయంలో మాత్రం దర్శకుడు తేలిపోయాడు. అతనేదో భిన్నంగా చేద్దామనుకున్నాడు కానీ.. అది బెడిసికొట్టేసింది. ఓవర్ ద టాప్ యాక్షన్.. సెంటిమెంట్ సీన్లతో దర్శకుడు చేజేతులా సినిమాను కిల్ చేశాడని చెప్పాలి.

చివరగా: లాఠి.. ఓవర్ ‘యాక్షన్’

రేటింగ్-2.25/5



Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
Tags:    

Similar News