రోటీన్ కు భిన్నం.. సోమ.. మంగళవారాల్లో రికార్డు కలెక్షన్లు

Update: 2022-03-16 03:29 GMT
ఎంత తోపు సినిమా కానీ.. గురు.. శుక్రవారాల్లో సినిమా విడుదలైతే.. మొదటి మూడు.. నాలుగు రోజుల్లో వచ్చే కలెక్షనే భారీగా ఉంటుంది. సోమవారం వచ్చే కలెక్షన్ సినిమా అసలు సత్తా ఏమిటో చాటి చెబుతుంటుంది. మరెంత వసూళ్లు వస్తాయన్న దానిపై అవగాహన కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. రెండో వారానికి వచ్చేసరికి.. వసూళ్లే కాదు.. థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గతానికి భిన్నంగా క్రేజీ సినిమా ఏదైనా భారీ ఎత్తున స్క్రీన్లలో వేసేయటం.. వచ్చింత వసూళ్లను మొదటి మూడు రోజుల్లో లాగేయటం అలవాటే.

అయితే.. ఇందుకు భిన్నంగా గత శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ వ్యవహారం ఉంది. డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ పుణ్యమా అని.. చాలావరకు థియేటర్లు ఆ సినిమాతో నిండిపోయాయి. దీంతో కశ్మీర్ ఫైల్స్ మూవీకి థియేటర్లు.. స్క్రీన్లు చాలా తక్కువగా లభించాయి. అయితే.. ముప్ఫై ఏళ్ల క్రితం కశ్మీరీ పండిట్ల మీద జరిగిన మారణహోమం గురించి బయట ప్రపంచానికి తక్కువగా తెలీటం.. అంత పెద్ద ఘోరం గురించి మీడియాలోనూ వార్తలు రాకపోవటం.. అప్పుడు జరిగిన దారుణాలను కొంత మాత్రమే చూపించారని.. చూపించని ఆరాచకాలు.. అమానవీయమైన ఘోరలు చాలానే ఉన్నాయన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమాకు ఆదరణ అంతకంతకూ పెరుగుతూ పోవటం ఒక ఎత్తు అయితే.. ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా సామాన్యుడి మొదలు దేశ ప్రధాని వరకు ఈ మూవీ గురించి మాట్లాడుకునే పరిస్థితి. జరిగిన జనోసైడ్ (నరమేధం) మీద ఇప్పటికి బయటకు రాని విషయాలెన్నో ఉన్నాయని చెబుతున్న వేళ.. ఈ సినిమాను చూడాలన్న ఆసక్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ సినిమాను చూసినోళ్లంతా.. తమకు తెలిసిన వారిని తప్పనిసరిగా చూడాలని చెప్పటం ఎక్కువైంది.

దీనికి తోడు సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో ఈ సినిమా గురించిన వివరాలు.. విశేషాలకు ఇప్పుడు టాప్ ప్రయారిటీ లభిస్తోంది. సినిమాల పట్ల పెద్ద ఆసక్తిని చూపించని వారు సైతం.. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారంటేనే.. ఇదెంత విజయం సాధించిందో అర్థమవుతుంది. బాక్సాఫీస్ కు అలవాటు లేని సరికొత్త అనుభవాన్ని ఈ మూవీ తీసుకొచ్చింది. విడుదలైన శుక్ర.. శని..ఆదివారాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లతో పోలిస్తే.. సోమ.. మంగళవారాలు 5 రెట్లు ఎక్కువగా రావటం విశేషం.ఈ మూవీ శుక్రవారం (మార్చి11, 2022) దేశ వ్యాప్తంగా 700 స్క్రీన్లతో విడుదలైతే.. ఆదివారం నుంచి దీని సంఖ్య 2000లకు పెరిగింది.

సోమవారం ఇదే ఊపు కొనసాగింది. కాకుంటే టైర్ 3 పట్టణాల్లో మాత్రం కాస్త కలెక్షన్లు తగ్గితే.. పట్టణాలు.. నగరాలు.. మహానగరాల్లో దీని మీద ఆసక్తి పెరగటంతో.. వసూళ్లు అక్కడ పెరిగాయి. సోమవారం రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. మంగళవారం కూడా అదే ఊపును కొనసాగిస్తుందని చెబుతున్నారు.

ఈ రోజు (బుధవారం), గురువారం నుంచి పలు మల్టీఫ్లెక్సులు ఈ సినిమాకు ఎక్కువ స్క్రీన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. ఈ మూవీ వసూళ్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News