'రాధే శ్యామ్' క్లైమాక్స్ మీదే ఒక ఏడాది కాలం వర్క్ చేశాను..!

Update: 2021-11-06 01:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ''రాధే శ్యామ్''. 1970ల కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విక్రమాదిత్య అనే పామిస్ట్ (హస్తసాముద్రికా నిపుణుడు) గా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ని బట్టి ఇందులో వింటేజ్ ప్రేమకథతో పాటుగా ఇంకేదో కొత్త విషయాన్ని చెప్పబోతున్నారనే హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. దీని కోసం దాదాపు ఒక ఏడాది పాటు ఆలోచించానని.. ఇది చాలా కాలం గుర్తుండిపోతుందని 'రాధేశ్యామ్' సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస వెల్లడించారు.

ఇటీవల మనోజ్ పరమహంస ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''రాధే శ్యామ్ క్లైమాక్స్ పై నేను దాదాపుగా ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. అలాంటి క్లైమాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం.. ప్రేక్షకులను ఒప్పించటం అంత ఈజీ కాదు. దాని మీద కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. వీక్షకులకు క్లైమాక్స్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు చూపించబోతున్నాం'' అని చెప్పుకొచ్చారు. దీంతో ఏడాది కాలం పాటు వర్క్ చేసిన రాధే శ్యామ్ క్లైమాక్స్ లో అంత స్పెషల్ గా ఉండే అంశాలు ఏం ఉన్నాయో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

'రాధే శ్యామ్' సినిమా విభిన్నమైన క్లైమాక్స్ తో రూపొందుతోందని.. విషాదాంతంగా ముగియబోతుందనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉంటుందని.. ఈ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా యాబై కోట్లు ఖర్చు పెట్టారని టాక్ నడిచింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. క్లైమాక్స్ మాత్రం స్పెషల్ గా ఉండబోతోందని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతోంది. రాధాకృష్ణ కుమార్ దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా, ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా 'రాధే శ్యామ్' తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కృష్ణం రాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

దక్షిణాది భాషలకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్.. హిందీ వెర్షన్ కు బాలీవుడ్ సంగీత ద్వయం మిథున్ మనస్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా 'రాధే శ్యామ్' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా చైనీస్ జపనీస్ వంటి విదేశీ బాషల్లోనూ ప్రభాస్ సినిమా విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.
Tags:    

Similar News