వెంకీ సినిమాకు అన్నీ కుదిరాయి

Update: 2015-10-30 07:30 GMT
మొత్తానికి విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమాకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ‘గోపాల గోపాల’ విడుదలై పది నెలలు గడుస్తున్నా ఇంకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టని వెంకీ.. మొన్నటిదాకా పెద్ద డైలమాలోనే ఉన్నాడు. ఐతే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల తర్వాత ఆయనకో క్లారిటీ వచ్చింది. తనతో ఇంతకుముందు ‘రాధ’ అనే సినిమా తీయబోయి ఆగిపోయిన మారుతితోనే జట్టు కట్టడానికి నిర్ణయించుకున్నాడు వెంకీ. మళ్లీ ఓ కొత్త కథతో వీళ్లిద్దరూ సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ - నిర్మాత అందరూ సెట్ అయిపోయారు.

లక్ష్మీ - తులసి లాంటి సినిమాలతో వెంకీకి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతారనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందట. ఇంతకుముందు ‘రాధ’ సినిమాకు కూడా ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు. జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు నిర్మించిన రాధాకృష్ణ అలియాస్ చినబాబు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బేనర్ మీదే ఈ సినిమాను నిర్మించనున్నాడు. రాధాకృష్ణ ఇప్పటికే త్రివిక్రమ్-నితిన్ లతో ‘అ..ఆ’, నాగచైతన్యతో ‘ప్రేమమ్’ రీమేక్ లు సెట్ చేశాడు. వాటితో పాటే వెంకీ-మారుతి సినిమాను కూడా ఒకేసారి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మారుతితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమాలోనూ భాగస్వాములు కావాలని ప్రయత్నించారట కానీ.. రాధాకృష్ణ ఒప్పుకోకుండా సొంతంగా సినిమాను నిర్మించడానికే మొగ్గు చూపారట.
Tags:    

Similar News