షూటింగులు ప్రారంభమయ్యేది ఆ రోజేనా...?

Update: 2020-05-28 17:30 GMT
దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ క్లోజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు ఆగిపోయాయి.. థియేటర్స్ బంద్ అయ్యాయి. దీంతో సినిమాపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వారు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని.. ప్రొడక్షన్‌ వర్క్‌.. షూటింగ్‌ లు.. థియేటర్లలో సినిమా ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో ఇండోర్‌ లో చేసే వీలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం సూచించారు. జూన్‌ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని.. పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

కాగా ఇంతకముందు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు మాసాబ్ ట్యాంక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, 'మా' అధ్యక్షుడు నరేష్, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని.. 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని మరియు తెలంగాణా చీఫ్ సెక్రటరీలతో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెల 15వ తారీఖు నుండి షూటింగులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వం కొన్ని షరతులతో దశల వారీగా కేవలం ఇండోర్ షూటింగులకు మాత్రమే అనుమతిచ్చిందట. దీనికి సంభందించి ఇప్పటికే ప్రభుత్వం అధికారిక జీవో రెడీ చేస్తోందని.. త్వరలోనే జీవో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
Tags:    

Similar News