మురుగదాస్ మాట తేడాగా ఉందే..

Update: 2018-10-31 08:09 GMT
తమిళంలో శంకర్‌ తరం తర్వాత చాలా పెద్ద స్థాయికి చేరుకున్న దర్శకుల్లో మురుగదాస్ పేరు ముందు చెప్పుకోవాలి. ‘రమణ’ దగ్గర్నుంచి ‘కత్తి’ వరకు అతను చాలానే బ్లాక్ బస్టర్లు కొట్టాడు. సామాజిక ప్రయోజనం ఉన్న కథలతో సినిమాలు చేయడం ద్వారా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అలాంటి దర్శకుడు ‘సర్కార్’ కథను కాపీ కొట్టాడంటూ వచ్చిన ఆరోపణలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ముందు ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మురుగదాస్.. చివరికి ఆరోపణలు చేసిన వరుణ్‌ తో రాజీకి రావడం మరింత ఆశ్చర్యం. ఒక వ్యక్తి తన ఓటును వేరెవరో వేసినందుకు ఆగ్రహానికి గురై వ్యవస్థ మీద పోరాడటం అనే లైన్‌ తో తాను కథ రాయగా.. వరుణ్ తనకంటే ముందు ఇదే ఆలోచనతో కథ రాశాడు కాబట్టి అతడికి టైటిల్స్‌ లో క్రెడిట్ ఇవ్వడానికి మురుగదాస్ అంగీకరించాడు.

ఐతే ఈ రాజీ విషయాన్ని అంగీకరిస్తూ మురుగదాస్ ఇచ్చిన ప్రెస్ నోట్ - వీడియో బైట్స్‌ లో అతడి అసహనం స్పష్టంగా కనిపించింది. సీనియర్ డైరెక్టర్ భాగ్యరాజ్ చెప్పాడు కాబట్టే రాజీకి వచ్చి.. ఏదో పోనీలే అని టైటిల్స్‌లో క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించినట్లుగా మాట్లాడాడు మురుగదాస్. దయతలిచి క్రెడిట్ ఇస్తున్నా తప్ప మరేమీ కాదన్నట్లే ఉన్నాయి మురుగ మాటలు. అంతా మాట్లాడాక ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం నూటికి నూరు శాతం మురుగదాస్‌ వే అని పేర్కొనడం ఆయన అసహనాన్ని చాటి చెప్పింది. మరోవైపు ప్రెస్ నోట్ లో మురుగదాస్ చాలా వ్యంగ్యంగా స్పందించాడు. తనకంటే ముందు వరుణ్‌కు ఇలాంటి ఆలోచన రావడం అభినందనీయమని.. ఈ సందర్భంగా అతడి లాంటి ప్రతిభావంతుడిని ఇండస్ట్రీకి అందించినందుకు దక్షిణ భారత రచయితల సంఘానికి ధన్యవాదాలని మురుగదాస్ పేర్కొనడంలోని వ్యంగ్యం తమిళ సినీ జనాలకు బాగానే అర్థమవుతోంది. మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో క్రెడిట్ ఇస్తున్నాడు తప్ప.. వరుణ్ విషయంలో మురుగదాస్‌కు పీకల దాకా కోపం ఉన్నట్లే  కనిపిస్తోంది వ్యవహారం చూస్తే.

 
Tags:    

Similar News