నాగ్ ఇకపై జగపతిబాబులా క్యారక్టర్స్ చేసుకోవాలా..?

Update: 2022-10-07 02:30 GMT
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ''ది ఘోస్ట్'' దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్ డే కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 'ది ఘోస్ట్' మూవీకి మొదటి రోజు చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా ఈ సినిమా పరిస్థితి అలానే ఉంది. లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవచ్చు అనుకున్న మేకర్స్ కు నిరాశ తప్పదనే కామెంట్స్ వస్తున్నాయి.

నిజానికి ఒకప్పుడు రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన నాగ్.. గత కొంతకాలంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ప్లాప్స్ సంగతి పక్కన పెడితే.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోవడం గమనార్హం.

'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' తర్వాత నాగార్జున నుంచి ఆ రేంజ్ లో వసూళ్ళు సాధించిన చిత్రం రాలేదనే చెప్పాలి. 'ఆఫీసర్' 'మన్మథుడు 2' 'వైల్డ్ డాగ్' వంటి చిత్రాలు ప్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు 'ది ఘోస్ట్' ఓపెనింగ్స్ చూస్తుంటే.. 'బంగార్రాజు' ఓపెనింగ్స్ కూడా తనయుడు నాగచైతన్య వల్లనే వచ్చాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాతో పాటుగా ఆయన సమకాలీకుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా విడుదలైంది. గత చిత్రాల స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ ను రాబట్టగలిగింది. మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం గతేడాది 'అఖండ' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

కానీ నాగ్ మాత్రం 'ది ఘోస్ట్' తో కనీస వసూళ్ళు అందుకోలేకపోవడం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. జనాలు థియేటర్లకు రాలేదంటే కింగ్ సినిమాల పట్ల వారిలో ఆసక్తి తగ్గిపోయిందని అనుకోవాలని యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నాగార్జున ఇకపై జగపతిబాబు మాదిరిగా సపోర్టింగ్ రోల్స్ చేసుకోవాల్సి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి నాగ్ కెరీర్ ప్రారంభం నుంచి కూడా అగ్ర దర్శకుల వెంట పరుగులు తీయకుండా.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారు. టాలీవుడ్ లో నాగ్ ఇంట్రడ్యూస్ చేసినంత మంది దర్శకులను మరే హీరో కూడా పరిచయం చేయలేదు. ఫుల్ ఫార్మ్ లో ఉన్నప్పుడు కూడా డెబ్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

ఈ క్రమంలో ఎన్ని ప్లాప్స్ ఎదురైనా ప్రయోగాలు చేస్తూ వచ్చారు నాగ్. అయితే అభిమానులు కోరుకునే కమర్షియల్ సినిమాలు చేయకపోవడంతో మెల్లి మెల్లిగా ఆయన ఫ్యాన్ బేస్ తగ్గిపోతూ వచ్చిందనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 'ది ఘోస్ట్' కు వస్తున్న కలెక్షన్స్ ఫిగర్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప ఈ మూవీ పైకి లేచే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

శుక్రవారం 'ది ఘోస్ట్' హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదల కాబోతోంది. నార్త్ లో నాగార్జున కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. మంచి వసూళ్ళు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఉత్తదారిలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుంది? ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది? అనేది తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తయ్యే వరకూ వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News