బాలయ్యతో సినిమా వేరే లేవెల్లో ఉంటుంది

Update: 2021-11-23 04:01 GMT
రాజమౌళి .. కొరటాల తరువాత ఇంతవరకూ అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపిస్తాడు. తన సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చుకోగలిగిన సమర్థులైన దర్శకులలో ఆయన ఒకరు. త్రివిక్రమ్ మాదిరిగానే తన కథల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా చూసుకుంటాడు.

ఇక కథాకథనాలు ఏవైనా, వినోదమే ప్రధానమన్నట్టుగా ఆయన సినిమాలు సాగుతుంటాయి. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమా షూటింగు పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆల్రెడీ ఆయన బాలకృష్ణకి కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు తరువాత అనిల్ రావిపూడితోనే తన సినిమా ఉంటుందని బాలకృష్ణ కూడా చెప్పారు.

అందువలన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలవుతున్నాయి. అయితే బాలకృష్ణ 100వ సినిమా సమయంలో ఆయనకి వినిపించిన కథనే అనిల్ రావిపూడి ఇప్పుడు చేయనున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదే విషయాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి స్పందించాడు. "అప్పట్లో నేను బాలకృష్ణగారి కోసం, 'రామారావుగారు' అనే కథను సిద్ధం చేసిన మాట నిజమే. కానీ నేను ఇప్పుడు బాలకృష్ణగారితో చేయాలనుకుంటున్న సినిమా మాత్రం అదికాదు. ఎప్పుడో రాసుకున్న కథలను ఇప్పుడు వర్కౌట్ చేయలేం. మార్కెట్ ను బట్టి .. అభిమానులు ఆశించే అంశాలను బట్టి .. హీరోల అభిప్రాయాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త కథలను రెడీ చేసుకోవలసి ఉంటుంది. అలా నేను బాలయ్య కోసం కొత్తగా రెడీ చేసుకున్న కథ ఇది.

ఇది బాలయ్య క్రేజ్ కీ .. ఆయన స్టైల్ కి .. ఆయన స్థాయికి తగిన కథ. బాలకృష్ణ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆయన మాస్ యాక్షన్ కి .. నా మార్కు కామెడీ టచ్ కూడా ఉంటుంది. ఇంతవరకూ తెరపై కనిపించిన బాలకృష్ణ వేరు .. ఈ సినిమాలో నేను ఆయనను చూపించే తీరు వేరు.

టైటిల్ దగ్గర నుంచి .. బాలయ్య లుక్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఆయన అభిమానులకు అన్ని రకాలుగా సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News