'ఆచార్య‌' కు కొత్త త‌ల‌నొప్పి.. మెగా ఫ్యాన్స్ వ‌ర్రీ!

Update: 2022-04-26 04:29 GMT
మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ తొలిసారి పూర్తిస్థాయిలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చిత్రం `ఆచార్య`. అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డేల‌ను హీరోయిన్స్ గా ఎంపిక చేయ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ను సినిమా నుంచి త‌ప్పించారు.

సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అనేక అడ్డంకుల‌ను దాటుకుని చివ‌రాఖ‌ర‌కు ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చిరు, చ‌ర‌ణ్‌, కొర‌టాల శివ‌, పూజా హెగ్డేలు వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాను వేరె లెవ‌ల్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉన్న త‌రుణంలో ఆచార్య కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది.

అదేంటంటే.. నైజాంలో ఆచార్యకు పూర్తి స్థాయిలో థియేటర్స్ అందుబాటులోకి రావడం లేదట. అందుకు కార‌ణం `కేజీఎఫ్ 2`నే. క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. టాక్ బాగుండ‌టంతో రిలీజ్ అయిన అన్ని చోట్ల రికార్డు బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్ ను రాబతున్న ఈ చిత్రం.. నైజాం లోనూ రూ. 38 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూల్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద ఊర మాస్ జాత‌ర సృష్టిస్తోంది.

ఇక రెండవ వారం కూడా కేజీఎఫ్ 2 వసూళ్లు స్థిరంగా ఉండ‌టంతో.. ఈ చిత్రాన్ని థియేటర్స్ నుండి తొలగించడం లేదు. పైగా ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. వాస్త‌వానికి పెద్ద సినిమాలన్నీ నైజాంలో ఈయనే రిలీజ్ చేస్తుంటారు. కానీ, ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్‌ను మాత్రం దిల్ రాజుతో పోటీ ప‌డి మ‌రీ వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నారు. దీంతో దిల్ రాజు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన కేజీఎఫ్ 2 ను తీసేసి ఆచార్యకు థియేటర్స్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని కూడా టాక్ న‌డుస్తుండ‌టంతో మెగా ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు.

మ‌రి విడుద‌ల‌కు ఇంకా మూడు రోజుల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. ఈలోపు నైజాంలో ఆచార్యకు థియేటర్స్ సమస్య తీరుతుందేమో చూడాలి. కాగా, దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశంతో కొర‌టాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సిద్ధ అనే ఓ కీల‌క పాత్ర‌ను చ‌ర‌ణ్ పోషించారు. ఈయ‌న రోల్ సినిమాలో దాదాపు న‌ల‌బై నిమిషాల వ‌ర‌కు ఉంటుంద‌ని టాక్‌.
Tags:    

Similar News