లండన్‌లో చిరూకి మెగా వెల్‌కమ్
ఈ సందర్భంగా పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవిని సత్కరించనుంది.;
టాలీవుడ్ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నలభై ఏళ్లకు పైగా ఆయన సేవలను , అతను చేసిన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవిని సత్కరించనుంది.
ప్రజా సేవల్లో ఎంతో ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు మార్చి 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని యూకే గవర్నమెంట్ ప్రధానం చేయనుంది. అందులో భాగంగానే చిరంజీవి మంగళవారం లండన్ చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు లభించిన ఈ ప్రత్యేక గౌరవంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
అయితే లండన్ కు చేరుకున్న తమ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం పలికేందుకు మంగళవారం తెల్లవారుజామున లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు వందలాది మంది మెగా ఫ్యాన్స్ వెళ్లారు. చిరూ ను రిసీవ్ చేసుకుని వారి ఆనందాన్ని తెలిపిన ఫ్యాన్స్ తో మెగాస్టార్ నవ్వుతూ సెల్ఫీలు దిగారు. హీత్రూ విమానాశ్రయంలో చిరూ ఫ్యాన్స్ చేసిన హంగామాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, దాని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. జూన్ నుంచి అనిల్ రావిపూడి- చిరంజీవి సినిమా సెట్స్ పైకి వెళ్లి సంక్రాంతికి రిలీజ్ కానుంది. అనిల్ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరూ సినిమా చేయనున్నాడు.