పూరి అయినా క‌ష్టాల క‌డ‌లి నుంచి గ‌ట్టెక్కిస్తాడా?

Update: 2022-08-06 01:30 GMT
హిందీ ప‌రిశ్ర‌మ‌ను క‌ష్టాల క‌డ‌లి నుంచి కాపాడే  ఒక దేవుడు కావాలి! ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ దేవుడు పూరి జ‌గ‌న్నాథ్ అవుతాడా?  స్ట్రెయిట్ హిందీ సినిమాగా రూపొందిస్తున్న `లైగ‌ర్`తో పూరి బాలీవుడ్ కి కొత్త క‌ళ తెస్తాడా? అంటూ చ‌ర్చ సాగుతోంది. నిజానికి `లైగ‌ర్` కి తెలుగు స‌ర్కిల్స్ లో కంటే హిందీ సర్కిల్స్ లోనే హైప్ ఎక్కువ‌గా ఉంది. ఇది ఒక స్ట్రెయిట్ హిందీ సినిమా అనేంత‌గా అక్క‌డ క‌ల‌రింగ్ ఇచ్చారు.

ముంబై లొకేష‌న్ల‌లో ముంబై క‌థ‌తోనే ఈ సినిమాని తీశారు. షూటింగ్ కోసం ధారావి మొత్తం చుట్టేశారు. ఇప్పుడు రిలీజ్ ముందు క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి పూరి - ఛార్మి - దేవ‌ర‌కొండ‌- అన‌న్య పాండే బృందం అంతా ముంబై వీధుల్లో తిరిగి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. దీనివ‌ల్ల `లైగ‌ర్` మ‌న సినిమానే అనేంత ప్ర‌బ‌లంగా అక్క‌డ‌ దూసుకెళ్లింది. స్ట్రెయిట్ హిందీ సినిమానే అని ఉత్త‌రాది జ‌నాన్ని బ‌లంగా నమ్మించేశారు.

అంతేకాదు.. చాలా వ‌ర‌కు భారీ హిందీ సినిమాలు చేయ‌లేనిది `లైగ‌ర్` చేస్తుంద‌ని కూడా ఇప్పుడు హిందీ ప్రేక్ష‌కుల్లో బ‌జ్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడా `లైగ‌ర్` ని చాలా బ‌లంగా న‌మ్ముతోంది. ఈ మూవీతో నిర్మాత క‌రణ్ జోహార్ హిట్టు కొట్ట‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌గా న‌మ్మినందుకు అది నిజ‌మ‌వుతుందా? అంటే పూరి స్క్రిప్టు బ‌లాబ‌లాల గురించి  కూడా చ‌ర్చించాలి.

ప్ర‌పంచ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైసన్ స్ఫూర్తితో ఒక చాయ్ వాలా ఇంటర్నేషనల్ MMA  ఛాంపియ‌న్ గా మారడం ఈ సినిమా కథ. ధారావి మురికివాడలకు చెందిన ఓ స్ట్రీట్ ఫైటర్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన క‌థగా దీన్ని తెర‌కెక్కించారు. అయితే ఇదే త‌ర‌హా క‌థ‌ల‌తో బాఘీ సిరీస్- బ్రదర్స్- దో లఫ్జోన్ కి కహానీ వంటి మ‌రికొన్ని సినిమాలు వ‌చ్చాయి.  అంతేకాదు లైన్ కొంత వేరుగా ఉన్నా కానీ `గ‌ల్లీ బాయ్స్` థీమ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది. ధారావి మురికివాడ‌లో ఒక‌ గ‌ల్లీ నుంచి ప్ర‌పంచ దిగ్గ‌జ ర్యాప‌ర్ గా ఎదిగిన ఒక యువ‌కుడి క‌థ తో `గ‌ల్లీబాయ్స్` తెర‌కెక్కి జాతీయ అవార్డుల్ని కైవ‌శం చేసుకుంది. ఇలా చూస్తే పూరి ఎంపిక చేసిన లైన్ ఆషామాషీ లైన్ అయితే కాదు.

లైన్ ఎంత సింపుల్ గా ఉందో అంత పెద్ద వెయిట్ ఉన్న‌దే. అయితే ఎంపిక చేసుకున్న‌ది ఏది అయినా కానీ దానిని క‌నెక్ట్ చేసిన విధానం ఎలా ఉంది? అన్న‌దే ఇక్క‌డ చాలా ఇంపార్టెంట్. పూరి చూపించ‌బోయే స్క్రీన్ ప్లే లో ఎమోష‌న‌ల్ డ్రైవ్ ఎంత‌? అన్న‌దే ఈ మూవీ విజ‌యానికి దారి చూపే ఎలిమెంట్. యాక్షన్- ఎమోషన్- రొమాన్స్- స్టైల్ ఇలా ప్ర‌తిదీ జ‌నానికి క‌నెక్ట‌యితే పెద్ద హిట్టు సాధ్య‌మే. `అమ్మా నాన్న త‌మిళ‌మ్మాయి`లో జ‌య‌సుధ పాత్ర‌ త‌ర‌హాలో శివ‌గామి ర‌మ్య‌కృష్ణ పాత్ర కూడా చాలా క‌నెక్టింగ్ గా పూరితీర్చిదిద్దాడ‌ని తెలుస్తోంది.

చాలా రొటీన్ క‌థ‌ల్ని ఎంచుకుని కూడా గ‌తంలో ఎంగేజింగ్ స్క్రీన్  ప్లేతో బ్లాక్ బస్టర్స్ గా మార్చాడు పూరీ అని దేవరకొండ అభిమానులు న‌మ్ముతున్నారు. పోకిరి- బిజినెస్ మేన్ - టెంపర్ ఇలాంటివే. కానీ పూరి మాస్ లో మాసివ్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా `లైగ‌ర్` కోసం త‌ను అంత‌కుమించిన‌ స్క్రిప్టు కోసం భారీ క‌స‌ర‌త్తులు చేసాడు. `లైగ‌ర్‌` కోసం భారీ గానే శ్ర‌మించాడు. ఇది అనుకున్న‌ట్టుగా హిందీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ట్రీట్ గా మారితే మంచిదే. దేవ‌ర‌కొండ‌కున్న క్రేజ్ దృష్ట్యా హిందీ బెల్ట్ కి `లైగ‌ర్` తో ఉప‌శ‌మ‌నం ల‌భించే పెద్ద హిట్టు ద‌క్కుతుంద‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News