విష్వక్ సేన్ కంటే ముందు ఐదుగురు హీరోలకు కథ చెప్పాను: 'పాగల్' డైరెక్టర్

Update: 2021-08-12 03:30 GMT
విష్వక్ సేన్ హీరోగా రూపొందిన 'పాగల్' సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండుగా జరిగింది. ఈ వేదికపై నరేశ్ కుప్పిలి మాట్లాడుతూ .. "సాధారణంగా తెరపై హీరో కనిపిస్తే ఆడియన్స్ విజిల్స్ కొడతారు. కానీ బ్యానర్ లోగో వస్తున్నప్పుడు విజిల్స్ కొట్టడం నేను దిల్ రాజుగారి సినిమాల విషయంలోనే చూశాను.

అలాంటి దిల్ రాజుగారు సమర్పిస్తూ ఉండగా నా తొలి సినిమా విడుదలవుతూ ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉంది. బెక్కెం వేణుగోపాల్ గారు ఈ కథను ఎంతగానో నమ్మారు .. నన్ను ముందుకు నడిపించారు. విజయ్ బెన్ని కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రధన్ ఇచ్చిన 7 పాటలు చాలా బాగావచ్చాయి. అన్నీ పాటలు నాకు ఎంతో నచ్చాయి. లియోన్ రీ రికార్డింగ్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళుతుంది. ఈ సినిమా తరువాత ఆయన తెలుగులో తప్పకుండా బిజీ అవుతాడు.

నా తరువాత నా అంతగా ఈ ప్రాజెక్టు పై శ్రద్ధ పెట్టింది విష్వక్ సేన్. ఆయనకంటే ముందుగా నేను ఈ కథను ఐదుగురు హీరోలకి వినిపించాను .. కానీ వర్కౌట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను విష్వక్ సేన్ కి కథను వినిపించాను. ఆయన చాలా సైలెంట్ గా కథ విన్నాడు. ఇక ఆయన కూడా చేయననే చెబుతాడు అనుకున్నాను. కానీ ఆయన తన సీట్లో నుంచి లేచి .. ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. అప్పటికీ కూడా నాకు నమ్మకం కుదరలేదు. ఆ తరువాత ఆయన కాల్ చేసి చెబితే అప్పుడు నమ్మాను. అప్పటి నుంచి ఆయన నాతొ పాటు సమానంగా ట్రావెల్ అవుతూ వచ్చాడు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది .. రాసుకోండి" అని చెప్పుకొచ్చాడు.

ఇక నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ .. 'దిల్ రాజు - శిరీష్' గార్లకు పది సార్లు థ్యాంక్స్ .. ఎందుకు అనేది సినిమా విడుదలైన తరువాత చెబుతాను. ఇకపై కూడా వారి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. నివేద పేతురాజ్ .. సిమ్రన్ .. మేఘలేఖ మాట్లాడుతూ విష్వక్ ఎనర్జీని గురించి ప్రస్తావించారు. నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తుండటం పట్ల ఆనందనాన్ని వ్యక్తం చేశారు. అంతా కూడా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పారు. "అందరూ థియేటర్లకు రావాలి .. అలా అనిచెప్పడంలో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే నా సినిమా ఈ నెల 19న థియేటర్లకు వస్తుంది కాబట్టి" అంటూ శ్రీవిష్ణు మాట్లాడాడు.




Tags:    

Similar News