మీనా విషయంలో చాలా బాధపడ్డాను!

Update: 2021-12-16 02:30 GMT
తెలుగు తెరకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై .. ఆ తరువాత హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అందుకున్న నాయికలలో, శ్రీదేవి తరువాత స్థానంలో మీనా కనిపిస్తుంది. తెలుగులోని సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నాయికగా మెప్పించిన మీనా, తమిళంలోను నెంబర్ వన్ కథానాయిక అనిపించుకుంది.

ఈ రెండు భాషల్లోను ఆమె ఖాతాలో సూపర్ హిట్లు కనిపిస్తాయి. అలాంటి మీనా గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

"మీనా అద్భుతమైన అమ్మాయి .. 'బాబులుగాడి దెబ్బ' సినిమాలో బేబీ మీనాగా చేసిన దగ్గర నుంచి, 'దృశ్యం' సినిమాలో తన కూతురి కారణంగా ఇబ్బందులను ఎదుర్కునే తల్లి పాత్ర వరకూ ఆమె గ్రాఫ్ ను మేము చూశాము. 'దృశ్యం 2'లో కూడా ఆమె చాలా నేచురల్ గా చేసింది. మీనా చేసిన అద్భుతమైన సినిమాలలో మా 'కర్తవ్యం' ఒకటి.

అందులో తన కోసమే కథ జరుగుతుంది. ఆ తరువాత 'బొబ్బిలి సింహం' సినిమాలో చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక వెంకటేశ్ తో చేసిన 'సుందరకాండ' కూడా గొప్పగా ఆడింది.

అయితే తన గురించిన రెండు జ్ఞాపకాలు నన్ను జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. నేను 'సర్పయాగం' సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ కథను నేను రామానాయుడుగారికి చెప్పగానే, ఇప్పుడు రోజా ఏ పాత్ర అయితే చేసిందో, ఆ పాత్రకి మీనాను తీసుకుందామని ఒక నిర్మాతగా ఆయన అన్నారు. నేను వద్దని చెప్పాను.

"అదేంటి గోపాలకృష్ణ ఆమె అద్భుతమైన ఆర్టిస్ట్ .. ఆమె అంటే ఆడియన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు" అన్నారు. అందుకే వద్దు సార్ అన్నాను నేను. అంత పేరున్న ఆర్టిస్టుకు తగిన నిడివి లేకపోయినా, ఆ పాత్ర మధ్యలోనే ముగిసిపోయినా ప్రేక్షకులు అసంతృప్తి చెందుతారని చెప్పాను.

అలా ఆ పాత్రకి రోజాను తీసుకోవడం జరిగింది .. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నేను చెప్పినదే కరెక్ట్ అని రామానాయుడుగారు కూడా అన్నారు. అయితే మీనాను వద్దని నేను అనడం సరైనదేనా కాదా అని నా మనసు పీకుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే 'మొరటోడు నా మొగుడు' అనే రాజశేఖర్ సినిమాకి మేము రాశాము.

అందులో మీనా పాత్ర మధ్యలో చనిపోతుంది. రామానాయుడుగారికి చెప్పిన మాటనే ఈ సినిమా దర్శక నిర్మాతలకు కూడా చెప్పాను. కానీ ఆ రోజులు వేరు అంటూ అంతా నన్ను ఒప్పించారు.

ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత మా పెద్దమ్మాయికి కాల్ చేసి, సినిమా చూశావా అని అడిగాను. "మీనా పాత్ర చనిపోతుందంటగదా చూడబుద్ధి కాలేదు" అంది. నేను చెప్పినట్టుగానే జరిగిందని అనుకున్నాను. ఒక ఆర్టిస్టుతో ఒక పాత్రను వేయించేటప్పుడు, ఆ పాత్ర వేస్తున్న ఆర్టిస్ట్ ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

లేకపోతే సినిమా దెబ్బతింటుందనే విషయం మీనా మూలంగా మాకు అర్థమైంది. తను అప్పట్లో ఎంత సంస్కారంతో ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండగలగడం నిజంగా చాలా కష్టమైన విషయం" అంటూ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News