ప‌వ‌న్‌, ప్ర‌భాస్ అభిమానులారా... చూడండి!

Update: 2015-09-08 04:51 GMT
అభిమానం ప‌దిమందికి మేలు చేసేదిగా ఉండాలి త‌ప్ప... ఎవ‌రినీ ఇబ్బంది క‌లిగించేదిగా ఉండ‌కూడ‌దు. అదే జ‌రిగితే అభిమానం అన్న మాట‌కి అర్థ‌మే లేదు. కానీ కొద్దిమంది అల్ల‌రి మూక‌లు అభిమానం ముసుగులో ఏవేవో చేస్తుంటారు. అది ప్ర‌జ‌ల‌కు ఎంత ఇబ్బంది క‌లిగిస్తుందో వాళ్లు ఊహించ‌రు. ఇలాంటివాళ్ల‌ను అభిమానులుగా కాకుండా దుర‌భిమానులు అని పిల‌వాల్సి వుంటుంది. ఈ త‌ర‌హా అభిమానంవ‌ల్ల  క‌థానాయ‌కుల‌కు కూడా కొన్నిసార్లు త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంటుంది. కొన్నిచోట్ల అభిమానం మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఎంత సహృద్భావ‌మైన వాతావ‌ర‌ణాన్ని పెంచుతుంటుంది. మ‌న‌మంతా ఒక‌టే, మ‌నం ఒక‌రికొక‌రం అన్న భావ‌న‌ని క‌ల‌గ‌జేస్తుంటుంది. ఇదిగో పైనున్న పోస్ట‌ర్ అలాంటి సందేశ‌మే ఇవ్వ‌డం లేదూ!!

ప్ర‌భాస్ సినిమా విడుద‌లైతే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అభిమానులు ఇలా పోస్ట‌ర్ వేయాలా? ప‌్ర‌భాస్ అభిమానులకు పవ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఇలా శుభాకాంక్ష‌లు చెప్పాలా?   చెప్పాల‌నే నియ‌మ‌మైతే ఎక్క‌డా లేదు. కానీ మ‌న‌మంతా ఒక్క‌టే అని చాటి చెప్పేందుకు ఇలాంటి పోస్ట‌ర్లు వెలుస్తుంటాయి. ఈరోజు  ప్ర‌భాస్ సినిమాకోసం ప‌వ‌న్ అభిమానులు పోస్ట‌ర్లు వేశాక‌... రేపు పవ‌న్ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులు పోస్ట‌ర్ లు వేయ‌కుండా ఎలా ఉంటారు? త‌ప్ప‌కుండా వేస్తారు. `బాహుబ‌లి` సినిమా విడుద‌ల స‌మ‌యంలో గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌డ చూసినా ఇలాంటి పోస్ట‌ర్ లే క‌నిపించాయి. ప‌వ‌న్ సినిమా విడుద‌లైన‌ప్పుడు కూడా ప్ర‌భాస్ అభిమానులు ఇదే త‌ర‌హాలో సంద‌డి చేస్తుంటారు. తొలి రోజే సినిమాకి వెళ్లి చూసొస్తుంటారు. ఇది తెలుసుకోకే భీమ‌వ‌రంలో ప‌వ‌న్‌, ప్ర‌భాస్ అభిమానులు ఓ ఫ్లెక్సీ  విష‌యంలో గొడ‌వ‌ప‌డ్డారు. తీరా న‌ష్టం జ‌రిగాక ఇరు వ‌ర్గాలు త‌మ త‌ప్పును తెలుసుకొన్నాయి. ఇప్పుడు ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉంది. ఊరి పెద్ద‌లు కూడా ఇరు వ‌ర్గాల్ని పిలిపించి హిత‌బోధ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్‌ లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ కూడా ఫోన్ లు చేసి అభిమానుల‌ను శాంత‌ప‌రిచార‌ట‌. ఇక‌పై అభిమానం ముసుగులో అక్క‌డ గొడ‌వ‌లు ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని పోలీసులు కూడా చెబుతున్నారు.
Tags:    

Similar News