'ప‌ఠాన్' వ‌సూళ్ల కంటే షారూఖ్ వాచ్ పైనే క‌ళ్ల‌న్నీ!

Update: 2023-02-10 16:00 GMT
రాజు రాజే! రారాజు రారాజే!! రాచ‌రికం పోయినా రారాజులా బ‌తికేవారు కొంద‌రే ఉంటారు. బాద్ షా అని పిలిపించుకున్నా కింగ్ ఖాన్ గా అర్హ‌త సాధించినా అది షారూఖ్ కే చెల్లింది. అతడి స్థానాన్ని రీప్లేస్ చేయ‌గ‌లిగే మొన‌గాడు దేశంలో పుట్ట‌లేద‌ని ఇన్నాళ్లు అభిమానులు గ‌ర్వించారు. కానీ ఇటీవ‌లి కాలంలో ప‌రిస్థితులు మారిపోయాయి. అజేయ‌మైన విజ‌యాల‌తో అరుదైన ట్రాక్ రికార్డును క‌లిగిన కింగ్ ఖాన్ ఐదేళ్లుగా నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాడు. ఎట్ట‌కేల‌కు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ప‌ఠాన్' ఘ‌నవిజ‌యంతో అత‌డు స‌వ్యంగా కంటిపై కునుకును ఆస్వాధిస్తున్నాడు. ప‌ఠాన్ 15వ రోజు 1000 కోట్ల క్ల‌బ్ లో ప్ర‌వేశించింద‌ని తెలియ‌గానే అత‌డిలో నూత‌నోత్సాహం క‌నిపించింది.

అంతేకాదు.. రాజు రాజే.. ప్ర‌జ‌ల‌ను పాలించే చ‌క్ర‌వ‌ర్తి బాద్ షా నేనే! అనేంత ధీమా షారూఖ్ కి ఇప్పుడు వ‌చ్చింది. ఇక అత‌డి విలాస‌వంత‌మైన వ్య‌వ‌హార శైలి కూడా బ‌య‌ట‌ప‌డింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బాద్ షా ఇప్పుడు ఉర‌క‌లెత్తిన ఉత్సాహంతో క‌నిపిస్తున్నాడు. ఈవెంట్లు మీటింగుల్లో త‌న‌దైన వైఖ‌రితో అల్ట్రా రిచ్ గా క‌నిపిస్తున్నాడు.

అత‌డు ధ‌రించిన ఓ వాచ్ ఖ‌రీదు సుమారు 5 కోట్లు. అది ఇంత‌కీ ఏ బ్రాండ్? అంటూ ఆరా తీసేంత‌గా మెస్మ‌రైజ్ చేసింది ఆ వాచ్. ఇంత‌కీ అది ఏ అంత‌ర్జాతీయ కంపెనీ వాచ్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

నిజానికి రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో కింగ్ ఖాన్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. భార‌త‌దేశంలోని ప్ర‌జ‌లంతా ఆద‌రించే అస‌మాన న‌టుడిగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకుని ఎదిగిన సెల్ఫ్ మేడ్ స్టార్ ఖాన్. ఇక అత‌డి ఆస్తుల విలువ అసాధార‌ణం. షారూఖ్ అత్యంత విలువైన ఆస్తికి సింబాలిక్ గా అతని సముద్ర ముఖ (సీ-ఫేసింగ్) విలాసాల భవంతి 'మన్నత్‌'ని చూసేందుకు అభిమానులు ప‌డిగాపులు ప‌డ‌తారు. దీని విలువ రూ.200 కోట్లు. ముంబైలో ఎన్నో ఆస్తులు అత‌డి సొంతం. అలాగే దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒక విలాసవంతమైన ఇంటిని క‌లిగి ఉన్నాడు. అలాగే BMW 6 సిరీస్ - 7 సిరీస్ కార్లు.. ఆడి బ్రాండ్ కార్లు సహా హై-ఎండ్ కార్లను సేకరించే ద‌మ్మున్న వాడిగా ఖాన్ గురించి చెబుతారు.

అయితే ఇప్పుడు ఐదు కోట్ల ఖ‌రీదు చేసే అంత‌ర్జాతీయ బ్రాండ్ వాచ్ తో మ‌రోసారి వార్త‌ల‌లో ప్ర‌ముఖుడయ్యాడు. ప‌ఠాన్ వ‌సూళ్ల కంటే ఇప్పుడు అత‌డి ఖ‌రీదైన వాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. 'పఠాన్' కోసం ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో షారూఖ్ ఖాన్ తన  నీలిరంగు చేతి గడియారంతో క‌నిపించాడు. సోగ్గాడిలా నలుపు రంగు సూట్ ను ధరించి స్టైలిష్ గా క‌నిపించాడు. అయితే ఆ సూట్ కంటే అత‌డి వాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సామాన్య ప్ర‌జ‌లు జీవితాంతం సంపాదించినా ఇంత సంపాదించ‌గ‌ల‌రా? అంటూ అహూతుల్లో ముచ్చ‌ట సాగింది.

దీపిక‌తో ఓ ఈవెంట్ లో కూడా అదే బ్లూ రిస్ట్ వాచ్ ధరించి షారూఖ్‌ కనిపించాడు. ఇది చాలా మంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప‌దే ప‌దే ఈ వాచ్ తో కింగ్ ఖాన్ ప‌బ్లిక్ లో క‌నిపిస్తుంటే ప్ర‌తి ఒక్క‌రూ ఇది ఏ బ్రాండ్ అంటూ ఆరా తీస్తున్నారు. ఈ వాచ్ 'ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్' (శాశ్వ‌త క‌లెక్ష‌న్) బ్రాండ్. దీని ధర రూ4.98 కోట్లు (డైట్ సబ్యా వివ‌రాల ప్రకారం). మ‌రో వెబ్ సైట్ అందించిన వివ‌రాల ప్ర‌కారం సుమారు 5కోట్లు. ఇలాంటి ఖ‌రీదైన వాచ్ ని ధ‌రించే ద‌మ్ము ద‌క్షిణాదిన ఉన్న పాన్ ఇండియా హీరోల‌కు ఉందా? అంటూ అప్పుడే ఒక సెక్ష‌న్ నెటిజ‌నుల్లో సోష‌ల్ మీడియాల వేదిక‌గా డిబేట్ స్టార్ట‌యింది. షారూఖ్ కి పోటీగా అలాంటి వాచ్ ధ‌రించ‌గ‌లిగే స్టార్ హీరో సౌత్ లో ఎవ‌రున్నారో వేచి చూడాలి.

షారుఖ్ వ‌రుస‌గా జ‌వాన్- డుంకీ లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇవ‌న్నీ మునుముందు అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా మార‌నున్నాయి. జ‌వాన్ తో సౌత్ మార్కెట్లోను త‌న‌దైన ముద్ర వేయాల‌ని షారూఖ్ చాలా తెలివైన ఎత్తుగ‌డ‌ను ఎంచుకున్నాడు. అందుకోసం త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News