ఈ నిర్మాత ఏది ముట్టుకున్నా..

Update: 2022-01-09 08:30 GMT
సి.క‌ళ్యాణ్‌.. టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత‌ల్లో ఒక‌రు. దాదాపు మూడు ద‌శాబ్దాల నుంచి ఆయ‌న సినిమాలు నిర్మిస్తున్నారు. ఒక‌ప్పుడు తేజ సినిమా అనే బేన‌ర్ మీద సినిమాలు తీసేవారు. త‌ర్వాత సీకే ఎంట‌ర్టైన్మెంట్స్ అనే సంస్థ‌లో సినిమాలు చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు మంచి ప‌రిచ‌యాలున్నాయి. పేరున్న హీరోలే డేట్లు ఇస్తుంటారు. కానీ స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డం వ‌ల్లో, ద‌ర్శ‌కుల ఎంపిక‌లో పొర‌బాట్ల వ‌ల్లో ఆయ‌నకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ‌మైన అనుభ‌వాలు ఎదుర‌వుతుంటాయి. ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, ఎటాక్, జ్యోతిల‌క్ష్మీ, లోఫ‌ర్, జై సింహా, ఇంటిలిజెంట్, రూల‌ర్, 1945.. గ‌త ప‌ది ప‌న్నెండేళ్ల‌లో సి.క‌ళ్యాణ్ నిర్మించిన సినిమాలివి. ఈ వ‌రుస చూస్తేనే ఆయ‌నకు ఆయా చిత్రాలు ఎలాంటి ఫ‌లితాన్నందించాయో అర్థ‌మ‌వుతుంది. వీటిలో ఒక్క జై సింహా మిన‌హాయిస్తే ఓ మోస్త‌రుగా ఆడిన సినిమానే లేదు. జై సింహాకు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లిసొచ్చి అది ఓ మోస్త‌రుగా ఆడింది.

మిగ‌తా సినిమాల‌న్నీ సి.క‌ళ్యాణ్‌కు దారుణాతి దారుణ‌మైన అనుభ‌వాలు మిగిల్చాయి. ఈ రోజుల్లో ప‌ర‌మ వీర చ‌క్ర‌, ఇంటిలిజెంట్, రూల‌ర్ లాంటి ఔట్ డేటెడ్ సినిమాలు చేయ‌డం క‌ళ్యాణ్‌కే చెల్లింది. దాస‌రి నారాయ‌ణ‌రావు పూర్తిగా ద‌ర్శ‌క‌త్వం ప‌క్క‌న పెట్టేసిన టైంలో బాల‌య్య డేట్లిచ్చాడ‌ని ఆయ‌న‌తో సినిమా తీస్తే ప‌ర‌మ‌వీర చ‌క్ర లాంటి పేల‌వ‌మైన సినిమాను ఇచ్చారు. ఇక వి.వి.వినాయ‌క్ ప‌నైపోయిన టైంలో ఇంటిలిజెంట్ లాంటి చెత్త సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక రూల‌ర్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో మూడుసార్లు బాల‌య్య లాంటి మాస్ హీరో డేట్లిస్తే ఆయ‌న‌తో రెండు భారీ డిజాస్ట‌ర్లు తీశాడు క‌ళ్యాణ్‌. బాహుబ‌లి త‌ర్వాత మాంచి క్రేజ్ తెచ్చుకున్న రానా సైతం ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చారు. త‌న‌తో 1945 అనే సినిమా మొద‌లుపెడితే.. అది ఎటూ కాకుండా పోయింది. చాలా ఏళ్లు వార్త‌ల్లో లేని ఈ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే తుస్సుమ‌నిపించింది. టాలీవుడ్లో మంచి పలుకుబ‌డి ఉన్న ఈ సీనియ‌ర్ నిర్మాత ఏది ప‌ట్టుకున్నా మ‌సి అయిపోతుండ‌టం విచారించాల్సిన విష‌య‌మే.
Tags:    

Similar News