మంచి సినిమా చేశాం.. చూడండి అంటే కుదురుతుందా?

Update: 2019-08-26 01:30 GMT
ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది? ఎందుకు ఫ్లాప్ అవుతుంది?  ఈ ప్రశ్నలకు పర్ఫెక్ట్ అన్సర్స్ తెలిసినవారు దాదాపు ఎవరూ ఉండరు. తెలిస్తే అందరూ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి కుబేరులు అవుతారు కదా.  ఎక్కువ డీటైల్స్ లోకి వెళ్ళకుండా పైనుంచి చూస్తే మాత్రం ప్రేక్షకులకు నచ్చిన సినిమా హిట్ లేకపోతే ఫ్లాప్.

అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ప్రేక్షకులకు నచ్చి కూడా కొన్ని ఫ్లాప్ గా మారతాయి.  ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చకపోయినా హిట్ గా నిలుస్తాయి.  ఇది సినిమా బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది.   చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక ఊరు పేరు తెలియని హీరో..దర్శకుడు.. నిర్మాత  ఒక అద్భుతమైన కథ ఉందని.. 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే జనాలకు నచ్చవచ్చు కూడా.  అయితే చచ్చినా మూడు వందల కోట్లు రావు.  మూడు నుంచి ముప్పై కోట్లే వస్తాయి.   అదీ ఒక యావరేజ్ సినిమాను పె..ద్ద స్టార్ తో 80 కోట్ల బడ్జెట్ తో తీస్తే 100 కోట్లు వస్తాయి. సూపర్ హిట్ అవుతుంది.  ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలో అంతే పెట్టాలి.  మన దగ్గర అవతార్ స్టొరీ ఉంది కదా అవతార్ బడ్జెట్ పెడితే కలెక్షన్స్ అవతారంగా ఉంటాయి.

సినిమా కథను బట్టి బడ్జెట్ పెట్టాలి అంటారు కానీ శుద్ధ తప్పు. సినిమాకు ఎంత మార్కెట్ అవుతుంది. ఎంత వెనక్కు తీసుకు రాగలదు అనే పాయింట్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే బడ్జెట్ పెట్టాలి.  కథ మంచిది కదా అని పరిమితి దాటి బడ్జెట్ పెట్టడం.. ఆ సినిమాను జనాలు పట్టించుకోకపోవడం.. మంచి సినిమాలను ఆదరించడం లేదని ఊరికే నిష్టూరమాడడం ఎందుకు?  హిట్ కావాలి అనుకుంటే ప్రేక్షకులకు నచ్చే సినిమానే తీయాలి.. బడ్జెట్ వీలైనంత అదుపులో ఉంచుకోవాలి.ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులను రప్పించగలిగే హీరో హీరోయిన్లనే ఎంపిక చేసుకోవాలి.   ఇవేవీ లేకుండా మేము కళాఖండం తీశాము.. జనాలు చూడడం లేదని ఊరికే బాధపడడం ఎందుకు?
Tags:    

Similar News