ఏపీలో టిక్కెట్టు రేట్ల‌పై ద‌ర్శ‌కేంద్రుని అసంతృప్తి

Update: 2021-12-02 04:47 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంపైనా టిక్కెట్ ధ‌ర‌లపైనా ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అగ్ర నిర్మాత‌లు డి.సురేష్ బాబు స‌హా నిర్మాత‌ల గిల్డ్ పెద్ద‌ల్లో ఏపీటో టిక్కెట్టు రేటుపై గ‌రంగ‌రంగానే ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా రిప‌బ్లిక్ వేదిక‌పై ఏపీ ప్ర‌భుత్వాన్ని టిక్కెట్టు రేటుపై ఎద్దేవా చేస్తే.. మెగాస్టార్ చిరంజీవి టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం పున‌రాలోచించాల‌ని సంద‌ర్భాన్ని బ‌ట్టి అయినా పెంచాల‌ని కోరారు.

తాజాగా ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు వంతు వ‌చ్చింది. ఆయ‌న రాసిన లేఖ‌లో ఊహించ‌ని ఫైరింగ్ క‌నిపించింది.  సినిమా హాళ్లలో టికెట్ రేట్ల‌ను స‌వ‌రించ‌డంపైనా ప్రభుత్వ వైఖరిపైనా ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాల గురించి ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

సినిమా పరిశ్రమలో కేవలం 20 శాతం సక్సెస్ శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. థియేటర్లు- డిస్ట్రిబ్యూటర్లు ఆ 20శాతం హిట్స్ తో మనుగడ సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదాయాన్ని నియంత్రించడంలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం దివ్యౌషధం కాదని రాఘవేంద్రరావు అన్నారు. ఇక మొదటి వారంలో ప్రభుత్వం అధికారికంగా టిక్కెట్ రేట్లను పెంచి పన్నుల ద్వారా మరింత ఆదాయం పొందాలని సూచించారు. టిక్కెట్ ధరలపై సీఎం పునరాలోచించి పరిశ్రమకు న్యాయం చేయాలని కోరారు. కె.రాఘ‌వేంద్ర‌రావు త‌ర్వాత ఇంకా ప‌లువురు సినీపెద్ద‌లు సీఎం జ‌గ‌న్ కి ఈ త‌ర‌హా విజ్ఞ‌ప్తులు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని తెలిసింది. ఏపీలో టిక్కెట్టు రేట్ల‌పై మూకుమ్మ‌డి దాడికి ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ణాళిక‌లు ఉన్నాయా? అంటే అవున‌నే గుస‌గుస‌లు ఫిలింన‌గ‌ర్ లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మంత్రి పేర్ని నానీతో మాటా మంతీ సాగించినా త‌మ‌కు అనుకూలంగా ఏదీ జ‌ర‌గ‌లేద‌న్న అసంతృప్తి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News