RRR హీరోలను డామినేట్ చేసిన రాజమౌళి..!

Update: 2021-11-01 16:21 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ''ఆర్‌.ఆర్‌.ఆర్‌'' (రౌద్రం రణం రుధిరం) సినిమా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే ప్రమోషన్స్ షురూ చేసిన జక్కన్న.. ఇందులో భాగంగా ఓ సర్ప్రైజింగ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. కేవలం 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. ప్రస్తుతం RRR గ్లిమ్స్ మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఈ వీడియోలో ట్రిపుల్ హీరోల కంటే రాజమౌళి హైలైట్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కలిసి నటిస్తోన్న ''ఆర్ ఆర్ ఆర్'' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలని ఒకే స్క్రీన్ మీద చూపించాలని డిసైడైన రాజమౌళి.. మొదటి నుంచీ ఇద్దరి ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ వచ్చారు. అందుకే పోస్టర్స్ - టీజర్లు - ఫస్ట్ సింగిల్.. ఇలా ఏది రిలీజ్ అయినా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరగలేదు.. జక్కన్న మీద ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన గ్లిమ్స్ లో కూడా అన్ని వర్గాల వారిని విపరీతంగా అలరిస్తోంది.

ఇప్పటికే విడుదలైన RRR హీరోల ఇంట్రో టీజర్లలో ఇద్దరినీ విడివిడిగా చూపించిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ గ్లిమ్స్ ను మాత్రం అందుకు భిన్నంగా చరణ్‌-తారక్‌ లు కలిసి ఉన్న సన్నివేశాలతో రూపొందించారు. ఇద్దరూ ఇంటెన్స్ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. నీరు నిప్పు ప్రతిరూపంగా ఇద్దరి మధ్య స్నేహాన్ని వైరాన్ని చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. మాస్టర్ స్టోరీ మరోసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే విజువల్ వండర్ ని రెడీ చేస్తున్నారని ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు RRR హీరోల కంటే ఎక్కువగా రాజమౌళి గురించే మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా సినిమాలలో మేజర్ క్రెడిట్ టెక్నిషియన్స్ కే దక్కుతుంది. కాకపోతే స్టార్ హీరోల విషయానికి వచ్చే సరికి ఎలాంటి కంటెంట్ అయినా హీరో ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇది రాజమౌళి సినిమాకు వర్తించదు. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా.. దాన్ని జక్కన్న బ్రాండ్ సినిమాగానే చూస్తారు. అందులో బాలీవుడ్ స్టార్స్ ఉన్నా సైడ్ అయిపోవాల్సిందే. ఏ కంటెంట్ బయటకు వచ్చినా ముందు రాజమౌళి గురించి మాట్లాడే.. ఆ తర్వాత మిగతా వారిని ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన RRR గ్లిమ్స్ విషయంలో కూడా అదే జరుగుతోంది.

తెర మీద రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఎంత కష్టపడినా.. తెర వెనుక రాజమౌళి కష్టం గురించి.. ఆయన విజన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరినీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేసినా.. రాజమౌళి మేకింగ్ అనేది దాన్ని డామినేట్ చేస్తోంది. జక్కన్న సినిమా అంటేనే ఆయన డామినేషన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. సినిమా బిజినెస్ కూడా ఆ బ్రాండ్ నేమ్ చూసే జరుగుతుంది కాబట్టి.. రాజమౌళి ఆధిపత్యం నడవడంలో తప్పులేదు. సినిమా సక్సెస్ అయితే ఎలాగూ హీరోలకి పేరుతో పాటుగా మార్కెట్ పెరుగుతుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో చూశాం. ఇప్పుడు RRR విడుదలైన తర్వాత ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల క్రేజ్ అమాంతం పాన్ ఇండియా స్థాయికి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే హీరోల అభిమానులు కూడా దర్శక ధీరుడికే మేజర్ క్రెడిట్ ఇవ్వడానికి సంకోచించడం లేదు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి దాదాపుగా రూ.450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పది బాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, RRR చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ స్టార్స్ అజయ్ దేవగన్ - ఆలియా భట్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News