లెక్కలు అంత పక్కాగా ఉన్నాయా జక్కన్నా

Update: 2016-08-06 08:09 GMT
బాహుబలి: ది బిగినింగ్ రిలీజ్ డేట్ విషయంలో ఎంత డ్రామా నడిచిందో గుర్తుండే ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్లో విడుదలవుతుందనుకున్న ఈ సినిమా.. మూణ్నాలుగుసార్లు వాయిదా పడి చివరికి జులై 10న రిలీజైంది. స్వయంగా రాజమౌళే రెండుసార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి కూడా ఆ తేదీలకు సినిమాను రిలీజ్ చేయలేకపోయాడు. ఓ దశలో జులై 10న కూడా డౌటే అన్నారు. కానీ చివరికి ఆ తేదీకి సినిమా రిలీజైపోయింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ఆఖర్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ 2016లోనే విడుదల అని ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ షూటింగ్ కూడా మొదలవకముందే సినిమా ఈ ఏడాది విడుదల కాదని తేలిపోయింది. కొన్ని నెలల కిందటే ఈ సినిమాను 2017 ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడేమో రెండు వారాలు వాయిదా వేసి ఏప్రిల్ 28న అంటున్నారు.

ఎప్పుడైనా రిలీజ్ డేట్ దగ్గర పడే సమయానికి తేదీల్లో మార్పులు జరగడం సహజం. డెడ్ లైన్ అందుకోలేమని అనుమానాలు కలిగినపుడు ఒకట్రెండు వారాలు వాయిదా వేస్తారు. ఐతే ఇంకా విడుదల తేదీకి 8 నెలలు ఉండగానే తేదీ మార్చడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకవేళ సినిమాను ఇంత ముందస్తుగా వాయిదా వేస్తున్నారంటే నెలో రెండు నెలలో వాయిదా వేయాలి కానీ.. రెండే వారాలు వెనక్కి జరపడం చిత్రమైన విషయం. ఈ మధ్య ఎండల వల్ల.. ఇంకొన్ని కారణాల వల్ల బాహుబలి షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా రెండు వారాలు వాయిదా వేసినట్లు అర్థమవుతోంది. ఐతే ఇలా పర్టికులర్‌ గా రెండు వారాలు డేట్ వెనక్కి జరిపారంటే ఈ ఎనిమిది నెలల్లో ఏ రోజు ఏం జరగాలో పక్కగా పేపర్ మీద ప్లాన్ ఉండే ఉంటుంది. కొన్ని రోజులు అటు ఇటు అయినా సర్దుబాటు చేసుకునేలా ప్లాన్ చేసినట్లున్నాడు జక్కన్న. స్వయంగా కరణ్ జోహార్ సైతం 2017 ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ ఖాయం అంటున్నాడు కాబట్టి ఆ డేటుకు ఫిక్సయిపోవచ్చన్నమాట.
Tags:    

Similar News