మెగాస్టార్‌ను ఇరికించే ప్రయత్నంలో వర్మ

Update: 2015-07-15 08:00 GMT
తనకేదైనా నచ్చితే వర్మ పొగడ్తలు మామూలుగా ఉండవు. అవతలి వ్యక్తి సిగ్గుతో చచ్చిపోయేలా పొగిడేస్తుంటాడు వర్మ. ఇంతకుముందు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, పూరి జగన్నాథ్‌లపై ఇలాగే పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పుడాయన కళ్లు బాహుబలి మీద, రాజమౌళి మీద పడ్డాయి. గత నాలుగైదు రోజులుగా బాహుబలి సినిమాను తనదైన శైలిలో పొగుడుతున్నాడు వర్మ. బాహుబలిని పొగిడితే పొగిడాడు కానీ.. ఈ సాకులో స్టార్ హీరోల గాలి తీసేస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చే స్టార్ హీరోల సినిమాలు తేలిపోతాయని.. అవి చాలా చిన్నగా కనిపిస్తాయని అంటున్నాడు వర్మ. బాహుబలి ఎఫెక్ట్ ముందుగా ‘శ్రీమంతుడు’ మీదే ఉంటుందంటూ మహేష్ సినిమాను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడిక వర్మ దృష్టి చిరంజీవి 150వ సినిమా మీద పడింది. ‘‘బాహుబలి తర్వాత దానికి దగ్గరగా రాగలిగే సినిమా మెగాస్టార్ 150వ చిత్రమే. ఆ సినిమా బాహుబలి స్థాయిలో లేకుంటే మెగా ఫ్యాన్స్ చాలా నిరాశపడతారు. బాహుబలి కంటే ఏమాత్రం తగ్గినా మెగా డిజప్పాయింట్‌మెంట్ తప్పదు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం అదే అవ్వాలి. సెకండ్ బిగ్గెస్ట్ అంటే ఒప్పుకునే సమస్యే లేదు. బాహుబలి కంటే భారీగా ఉంటేనే ఏడేళ్ల పాటు మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు అర్థం ఉంటుంది’’ అని ట్వీట్లు గుప్పించాడు వర్మ. అయినా బాహుబలి అనేది ప్రత్యేకమైన సినిమా. దాన్ని దేంతోనూ పోల్చి చూడటానికి అవకాశం లేదు. బహుశా రాజమౌళి కూడా ఇలాంటి సినిమా ఇంకోటి తీయలేడేమో. ప్రభాస్ కంటే పెద్ద స్టార్ అయిన మహేష్‌తో సినిమా తీయబోతున్న రాజమౌళి.. ఆ సినిమాను సైతం బాహుబలి స్థాయిలో తీయలేకపోవచ్చు. బాహుబలి లాంటి సినిమాలు ఎప్పుడూ సాధ్యం కావు. అలాంటి సినిమాలు ప్రతిసారీ తీసేయగలిగితే.. ఇక దాని ప్రత్యేకత ఏముంటుంది? ఈ సంగతులేవీ వర్మకు తెలియనివి కావు. అయినా ఊరికే అలా జనాలకు కాక పుట్టించడం ఆయనకు సరదా.
Tags:    

Similar News