'ఒక మనిషి కోసం ఇంతమంది తలవంచాల్సి వచ్చింది'.. బన్నీపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు.
‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, మధ్యంతర బెయిల్ పై బయటకు రావడం అందరికీ తెలిసిందే. బన్నీ కేసు విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లపై హైక్ ఉండవని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమై గంటన్నర సేపు పలు అంశాలపై చర్చించారు. దీనిపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు. ''ఇండస్ట్రీ అంతా వెళ్లి చీఫ్ మినిస్టర్ దగ్గర తలవంచుకుని నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఒక్క మనిషి కోసం. ఆయన సొంతంగా చేశాడా, ప్రేరేపితుడై చేశాడా అనేది నాకు తెలియదు కానీ.. అక్కడ తప్పు అయితే జరిగింది. మర్డర్ ఆయన చేశాడని నేను అనడం లేదు. కానీ రోడ్ షో చేయడం వల్ల తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. ఏదైనా గానీ తప్పు తప్పే. ఈ తప్పు జరిగిన తర్వాత మళ్లీ దాన్ని కవర్ చేయడానికి కొన్ని అబద్దాలు ఆడడం.. వీటన్నిటి వల్ల గవర్నమెంట్ కి కూడా ప్రెస్టీజ్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడేది వీళ్ళు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కాంప్రమైజ్ అంటామో, తలవంపులు అంటామో.. ఏమంటామో నాకు తెలియదు. ఒక మనిషి కోసం.. ఒక మనిషి ఇగో కోసం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వచ్చింది'' అని తమ్మారెడ్డి అన్నారు.
''ముఖ్యమంత్రిని కలిసి తర్వాత ఈ సమస్య సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు కారణం?. ప్రతిసారీ సమస్య రావడం.. ఇండస్ట్రీ అంతా వెళ్లి ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి తీసుకురావడం.. దీనికి బాధ్యులు ఎవరు?. ఎవరో ఒకరి స్వార్ధం కోసం మొత్తం ఇండస్ట్రీ అంతా తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. సినిమా వాళ్లందరికీ తలవంపులు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వస్తోంది?. అసలేం జరుగుతోంది అని ఆలోచించుకుంటే అందరికీ అర్థం అవుతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడా? అతని పీఆర్ టీమ్ బాధ్యులా? లేకపోతే బన్నీ చుట్టూ ఉన్న కోటరీ బాధ్యులా?''
''బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే, అందరు హీరోల చుట్టూ ఓ కోటరీ ఉంటుంది. పక్కనున్న సో కాల్డ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కొంతమంది ఆప్తులమని చుట్టూతా చేరిపోతారు. మామూలుగానే ప్రజలు హీరోలను దేవుళ్లుగా చూస్తుంటారు. వాళ్ళకి కూడా దేవుళ్లమనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళకి వీళ్ళు తప్పుడు సలహాలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువైపోయింది. మంచి చెప్పాలని అనుకున్నవాడు ఎవడైనా, ఎవరికీ తెలియకుండా వెళ్లి సినిమా చూసి వచ్చేద్దాం అని చెప్పుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అలా కాకుండా ప్రదర్శన చేయాలి. నాలుగు కార్లలో వెళ్లి రోడ్ల మీద చేతులు ఊపాలి.. ప్రజలంతా మన కోసం వెయిట్ చెయ్యాలి. ఈ మధ్యకాలంలో ఇది రెగ్యులర్ గా జరుగుతోంది. అంతకముందు బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలందరూ ప్రసాద్ మల్టీప్లెక్స్ కి ఒంటరిగా వచ్చి సినిమా చూసి వెళ్లిపోయిన రోజులు ఉన్నాయి. వాళ్లంతా సింగిల్ స్క్రీన్ థియేటర్లలకు కాకుండా మల్టీప్లెక్స్ లకు వెళ్లేవారు''
''సుదర్శన్ లాంటి సింగిల్ స్క్రీన్స్ లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. మాస్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి, అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఒక క్యాబిల్ లో కూర్చొని సినిమా చూసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పక్కన ఉన్నవాళ్ళు 'అలా వెళ్తే మన వేల్యూ పోతుంది.. మనం ముందే చెప్పాలి' అంటూ ఫ్యాన్స్ అందరికీ వాట్సాప్ లో మెసేజులు పంపిస్తున్నారు. జేజేలు పలకాలి.. ప్లకార్డులు పట్టుకోవాలి అని చెబుతున్నారు. పక్కన ఉన్నవాళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. హీరోలెవరూ చిన్న పిల్లలు కాదు. వీళ్లకు వీళ్ళు ఆలోచించుకోవాలి. ఈ స్టేజ్ కి రావడానికి ఎంతో కష్టపడ్డారు.. ఎంతో కృషి చేసారు. అంత కష్టపడి పైకి వచ్చినవారు చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లేదు. సొంతంగా ఆలోచించే స్థితిలోనే ఉన్నారు. సినిమా కథలు, నిర్మాతలు, దర్శకుల గురించి ఆలోచిస్తున్నారు. ఎంత మార్కెట్ ఉంది, ఎంత డబ్బులు తీసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇన్ని ఆలోచిస్తున్న వారు ఇలాంటి చిన్న చిన్నవి, ప్రజల శ్రేయస్సు గురించి, ఫ్యాన్స్ ఆర్థిక పరిస్థితులు, చావుబతుకుల గురించి ఆలోచించలేరా? ఆలోచిస్తే ఇలాంటివి జరగవు''
''ప్రీమియర్స్ షోస్, టికెట్ రేట్లు పెంచడం ఎందుకు? మనం తీసుకునే డబ్బుల కోసం, మార్కెట్‌లో నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నానని చెప్పడం కోసం టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోంది. కొంతమంది హీరోలు 50 శాతం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. హీరోలెవరైనా 25 శాతం షేర్ తీసుకోవడం ధర్మం. మిగిలిన 25 శాతం ఇతర రెమ్యునరేషన్స్ కి అవుతుంది. మిగిలిన 50 శాతంలో ఖర్చులు అన్నీ పోతాయి. అలా చేస్తే సినిమా ప్లాప్ అయినా కాస్ట్ కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ప్రజల మీద భారం వేస్తున్నాం. హీరో ఎంత అడిగితే అంత కంటే ఎక్కువే ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీ అయిపోతున్నారు. ఆ భారమంతా తీసుకెళ్లి టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకుల మీద వేస్తున్నారు''
''మొన్న ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను తెలుగు సినిమాకి, దేశానికి గర్వకారణం అవ్వడానికి ఇదంతా చేస్తున్నానని అన్నాడు. అల్లు అర్జున్ మాత్రమే కాదు.. ఏ హీరోకైనా తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తమ పర్ఫామెన్స్ తో గర్వకారణం అవ్వాలి కానీ, కలెక్షన్లతో కాదు. 'దంగల్' సినిమాకి కూడా కలెక్షన్లు బాగొచ్చాయి. పర్ఫామెన్స్ బాగుంది. 'పుష్ప 2'లో 100 శాతం అల్లు అర్జున్ బాగా పర్ఫామెన్స్ చేసాడు. ఆయన ఒక్కడే సినిమాని లాక్కొచ్చాడు. కానీ ఆ సినిమా మనకేం చెబుతుంది. కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏం తీసినా తప్పులేదు. అందరూ నీతి సినిమాలే తీయాలని లేదు. అదే కమర్షియల్ సినిమా తీసి దేశం కోసం తీస్తున్నానని అనకూడదు.. తప్పు అది. అవి మీ కోసం, ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా తీసుకోవచ్చు తప్పు లేదు. కానీ అవన్నీ రాష్ట్రానికి భాషకి తెలుగు తేజానికి పేరు తెచ్చే సినిమాలు అంటున్నారు''
''దంగల్, సత్యం సుదరం లాంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీసారు. అది ఫెంటాస్టిక్ గా ఉంది. అలాంటిది ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా చేస్తే జోహార్లు కొట్టొచ్చు, పాదాభివందనం కూడా చేయొచ్చు. అది మానేసి, ఒక పోలీసాఫీసర్ ని తక్కువగా చూపించారు. ఆల్రెడీ పోలీసుల మీద కొందరికి దరిద్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. పోలీసుల్లో కూడా చాలామంది గొప్పవారు ఉన్నారు. ప్రాణ త్యాగం చేసినవారు, న్యాయం కోసం పోరాడుతున్నవారు ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది కరెప్ట్ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఇలానే అనే విధంగా, ఇంత పెద్ద సినిమాలో ఫహద్ ఫాజిల్ లాంటి యాక్టర్ ని పెట్టి పోలీస్ ఆఫీసర్‌ని కమెడియన్ చేసి.. విలన్ గా చూపిస్తే ఎంత బ్యాడ్ గా ఉంటుంది. ఒకరకంగా అతను మంచి పోలీసాఫీసర్. ఒక దొంగను పట్టుకోడానికి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో విలన్ అయ్యాడు. కమర్షియల్ సినిమా కాబట్టి మనం మాట్లాడానికి ఏం లేదు. కానీ మిమ్మల్ని ఉద్దరించడానికే ఇలాంటి సినిమాలు తీసాం అనే మాటలు మాట్లాడకూడదు'' అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.