మొన్న చిరంజీవి...నేడు బుచ్చిబాబు ఇదా సంగతి!
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ లోప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.;
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ లోప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులంతా సర్ ప్రైజ్ అయ్యారు. వంగా ఆఫీస్ లో మెగాస్టార్ ఏంటి? అనే డిస్కషన్ నడిచింది. తాజాగా అదే వంగా ఆఫీస్ లో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా ప్రత్యక్షమయ్యాడు. సందీప్ వంగా ఇద్దరు కలిసి కెమెరాకి కొన్ని ఫోజులు కూడా ఇచ్చారు. మరి అప్పుడు చిరంజీవి..ఇప్పుడు బుచ్చిబాబు. సందీప్ వంగా ఆఫీస్ కిపనిగట్టుకుని ఎందుకు వెళ్లినట్లు? అనే డిస్కషన్ వాడి వేడిగా సాగుతోంది.
సందీప్ వంగాతో చిరంజీవి ఏదైనా సినిమా చేయడానికి అవకాశం ఉందా? అంటే ఆ ఛాన్స్ ఇప్పట్లో లేదు. ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు. మరి బుచ్చిబాబు-సందీప్ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. మరెందుకు వంగా ఆఫీస్ కి వెళ్లినట్లు? అంటే అందుకో బలమైన కారణం వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ లో మెగాస్టార్ క్లాసిక్ ఫోటోలు కొన్నిగోడలకు అతికించి ఉంటాయి.
చిరంజీవి పాత సినిమా స్టిల్స్ లో నచ్చిన వాటిని ప్రేమ్ లు చేయించుకుని వంగా వాటిని గోడల నలు భాగాలకు తగిలించాడు. వంగా సినిమాల్లోకి రావడానికి చిరంజీవి స్పూర్తి. కష్టపడి ఎదిగిన చిరంజీవి అంటే ఆయనకు ఎంతో అభిమానం. చిరంజీవి పాత సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికి వాటిని ఖాళీ సమయంలో చూస్తుంటాడు.
ఈ నేపథ్యంలో వంగా ఆఫీస్ లో చిరంజీవి ఫోటోలు ఎలా ఉన్నాయి? అన్నది చూడటానికి వెళ్లినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. బుచ్చిబాబు చిన్నప్పుడే చిరంజీవి కి ఓ అభిమానిగా ఓ లేఖ కూడా రాసాడు. ఆ పాత జ్ఞాపకాల్లో భాగంగానే బుచ్చిబాబు కూడా చిరు ఫోటోలు చూడటానికి ఆఫీస్ కి వెళ్లినట్లు వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.