'కింగ్‌స్టన్' లాంటి సినిమాలు బాగా ఆడాలి: నితిన్
విభిన్న కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంటెడ్ నటులలో జీవి ప్రకాష్ కుమార్ ఒకరు.;
విభిన్న కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంటెడ్ నటులలో జీవి ప్రకాష్ కుమార్ ఒకరు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే మంచి గుర్తింపు అందుకున్న అతను రెగ్యులర్ గా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈసారి 'కింగ్‌స్టన్' అనే మరో ప్రయోగంతో రాబోతున్నాడు. ఇక చిత్ర బృందం, సినిమా విడుదలకు ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ యువ హీరో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ అతిథులు, చిత్రయూనిట్ సభ్యులు సినిమా విశేషాలను పంచుకున్నారు.
నితిన్ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చూడగానే ఇదొక విజువల్ ట్రీట్ లా ఉండబోతున్నట్లు అనిపించింది. ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ఇది ఇండియాలోనే ఫస్ట్ సముద్రపు అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమాను మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ మహేశ్వర రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు. ఆయనకు మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
ఇక నితిన్, జీవీని చూస్తూ, "మీరు హీరోగా సంగీత దర్శకుడిగా ఇంత బిజీగా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు, ఇది ఎలా సాధ్యమవుతోందని?" అని ప్రశ్నించగా, జీవీ ప్రకాష్ సరదాగా "రోజూ కష్టపడతా" అని సమాధానమిచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 'కింగ్‌స్టన్'ను విడుదల చేస్తున్న గంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ మహేశ్వర రెడ్డి, ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. "కథాంశం, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ కాంబినేషన్ ఈ సినిమాను మన దగ్గర విడుదల చేయడానికి ప్రేరేపించాయి," అని ఆయన తెలిపారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటూ, 'కింగ్‌స్టన్' తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించబోతుందని, ఇందులో జాంబీలు, ఆత్మల అంశాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌గా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ, "జీవీ ప్రకాష్, దర్శకుడు కమల్ ప్రకాష్ కరోనా మహమ్మారి కాలం నుంచి ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ శ్రమ ఫలితాన్ని తెరపై చూడబోతున్నారు," అని వెల్లడించారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ వీరాభిమానులైన నితిన్, జీవీ ప్రకాష్ ఇద్దరూ సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రస్తావించారు. జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య విజయ్ మాట్లాడుతూ, "ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంలో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. కింగ్‌స్టన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని నమ్మకం," అని అన్నారు. 'లక్కీ భాస్కర్' దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "కింగ్‌స్టన్ గ్రేట్ క్వాలిటీ కలిగిన సినిమా. వీయఫ్ఎక్స్ పనిచేయించిన విధానం బడ్జెట్ పరంగా చూసుకున్నా చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు కమల్ ప్రకాష్ గొప్ప విజయాన్ని అందుకోవాలి," అని ఆకాంక్షించారు.
ఈ సినిమాలో దివ్య భారతి, చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమరవేల్, సబుమోన్ అబ్దుసామద్ కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్‌గా గోకుల్ బెనోయ్ పనిచేశారు. ఫాంటసీ, అడ్వెంచర్, హారర్ అంశాలతో భిన్నమైన అనుభూతిని అందించబోతున్న 'కింగ్‌స్టన్' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.