సుధీర్‌బాబు మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్..!
సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'జటాధర'.;
సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'జటాధర'. గత ఏడాదిలోనే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా సుధీర్ బాబు లుక్‌ను రివీల్ చేశారు. చేతిలో త్రిశూలం పట్టుకున్న సుధీర్ బాబు వెనక పరమశివుడు ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆలస్యం అయినా సుధీర్ బాబు ఒక గొప్ప ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడని చాలా మంది ఆ సమయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా జటాధర సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్నాళ్లు సస్పెన్స్‌గా ఉంచిన హీరోయిన్ విషయాన్ని రివీల్ చేయబోతున్నారట. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 'జటాధర' సినిమాలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించబోతుంది. టాలీవుడ్‌లో సోనాక్షి నటించబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. జటాధర సినిమాలో సోనాక్షి హీరోయిన్‌గా కనిపించనుందా లేదంటే మరేదైనా ముఖ్య పాత్రలో ఆమెను దర్శకుడు వెంకట్ కళ్యాణ్ చూపించబోతున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ కల్పించేందుకు గాను ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి సుధీర్ బాబు 'జటాధర' సినిమాపై అంచనాలు పెంచే విధంగా సోనాక్షి సిన్హాను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమెకు కథ చెప్పారని ఈ నెల మూడో వారం లేదా నాల్గవ వారంలో జరిగే షూటింగ్ కోసం హైదరాబాద్ సైతం రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. జటాధర సినిమాలో సోనాక్షి సిన్హా నటించడం ద్వారా కచ్చితంగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఈ తెలుగు సినిమా గురించి హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు, ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోనాక్షి సిన్హా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాదిలోనూ ఈమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పవర్ ఫుల్ పాత్రలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అనే అభిప్రాయం ఉంటుంది. అందుకే సోనాక్షి సిన్హాను జటాధర సినిమాలో ఎంపిక చేసి ఉంటారని, సినిమాలో ఉండే పవర్ ఫుల్ పాత్రకు ఆమె కచ్చితంగా న్యాయం చేస్తుందనే నమ్మకం, విశ్వాసంను సుధీర్ బాబు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు జటాధర సినిమాలో సోనాక్షి సిన్హా నటిస్తుందా లేదా అనే విషయంలో అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ బాబు హీరోగా కమర్షియల్ సక్సెస్ అందుకుని చాలా కాలం అయింది. మరి ఈ సినిమాతో అయినా ఆయనకు సక్సెస్ దక్కేనా అనేది చూడాలి.