రవితేజ.. పర్ఫెక్ట్ పండగ ప్లాన్
అయితే, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. రవితేజ కూడా వెంకటేష్ తరహాలో టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.;
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల వరుస అపజయాలతో వెనుకబడ్డ రవితేజ, తన తదుపరి సినిమాలకు చాలా జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నాడు. మాస్ జాతర అనే హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. రవితేజ కూడా వెంకటేష్ తరహాలో టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమా సక్సెస్ కావడానికి కాంబినేషన్ ఒక కారణమైతే రిలీజ్ స్లాట్ మరో ముఖ్యమైన రీజన్. ఇక రవితేజ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడట. సాధారణంగా సంక్రాంతి టాలీవుడ్‌కు బిగ్గెస్ట్ సీజన్. ప్రతి పెద్ద హీరో తన సినిమాను ఈ పండగ సీజన్‌లో రిలీజ్ చేయాలని చూస్తాడు.
ఇప్పటివరకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, చిరంజీవి-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లు ఈ ఫెస్టివల్ సీజన్ కోసం లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పోటీకి మాస్ మహారాజా కూడా జాయిన్ అవుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సంక్రాంతి సక్సెస్ రేషియోలో ఉన్న అనిల్ ఈసారి చిరంజీవితో వస్తున్నారు కాబట్టి ఆ సినిమాకు పోటీగా నిలవడం అంత ఈజీ కాదు. అయితే రవితేజ కూడా ఓ ప్లానింగ్ తోనే వస్తున్నాడు. తన కొత్త సినిమాను క్లాస్ మేకర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నాడనే న్యూస్ కన్ఫర్మ్ అయింది. కిషోర్ తిరుమల సినిమాలకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది.
నేను శైలజ, చిత్ర లహరి వంటి ప్రాజెక్ట్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు, రవితేజతో కలిసి ఏ తరహా కథను తీసుకురాబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు రవితేజ మాస్ యాక్షన్ పాత్రలలోనే ఎక్కువ కనిపించాడు. అయితే, ఈసారి మాత్రం ఫ్యామిలీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అవుతుందనే ఆలోచనలో ఉన్నారట.
వెంకటేష్ తరహాలోనే మాస్ రాజా కూడా సంక్రాంతి టైమ్ లో సీజన్ కు తగ్గ కాంటెంట్ తో హిట్టు కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. గతంలో దసరా, రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలను నిర్మించిన ఈ నిర్మాత ఇప్పుడు రవితేజ - కిషోర్ ప్రాజెక్టును కూడా గ్రాండ్ గా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్, క్లాస్ మిక్స్‌గా రూపొందనున్న ఈ సినిమా, సంక్రాంతి రిలీజ్ కోసం ముందుగానే ప్లాన్ చేయబడింది.
అయితే, ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. రవితేజ మాస్ ఇమేజ్‌కు కిషోర్ తిరుమల నేరేషన్ ఎంతవరకు సరిపోతుందనేది. గత రెండేళ్ళలో రవితేజకు వరుసగా నాలుగు ఫ్లాప్స్ వచ్చాయి. ముఖ్యంగా రావణాసుర, మిస్టర్ బచ్చన్ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో రవితేజ మళ్లీ తన ఫామ్‌లోకి రావాలంటే స్ట్రాంగ్ హిట్ అవసరం. మాస్ జాతర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుందో తెలియదు కానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమా మాత్రం రవితేజ కెరీర్‌కు కీలకమవ్వనుంది. భారీ పోటీ ఉన్న ఈ సీజన్‌లో రవితేజ తన మార్కెట్‌ను నిలబెట్టుకోగలడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.